వికారాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల జోరు.. నిర్మాణంలో వేల ఇళ్లు

by Batti.Sumithra |

జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, మొదటి విడతలో 12,863 ఇళ్లు మంజూరు చేయగా, అందులో 8,832 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో కొనసాగుతున్నాయి.

వికారాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల జోరు.. నిర్మాణంలో వేల ఇళ్లు
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, మొదటి విడతలో 12,863 ఇళ్లు మంజూరు చేయగా, అందులో 8,832 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో కొనసాగుతున్నాయి. మరో 4,031 ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నిర్మాణ దశలను పరిశీలిస్తే—బేస్‌మెంట్ స్థాయిలో 2,160 ఇళ్లు, రూఫ్ లెవెల్‌లో 1,267 ఇళ్లు, స్లాబ్ పూర్తిచేసుకున్నవి 3,083 ఇళ్లు కాగా, పూర్తిస్థాయి నిర్మాణ దశలో కొనసాగుతున్నవి కూడా ఉన్నాయి. ఇప్పటివరకు 785 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో కొంత మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు పేదలకు సొంతింటి కల నెరవేరకపోవడంతో వారు తీవ్ర అయోమయంలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ, పేదల సొంతింటి కలను నెరవేర్చుతోంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండో విడతలో మే నెల నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేయడానికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో ప్రారంభమైన ఇళ్లను పూర్తిచేసి గృహప్రవేశాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగడం లేదని, నిర్మాణ దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తూ వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.155 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు : జిల్లా హౌసింగ్ అధికారి సయ్యద్ ముక్రం

జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా హౌసింగ్ అధికారి సయ్యద్ ముక్రం తెలిపారు. మొదటి విడత ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేదని స్పష్టం చేశారు. వచ్చే మే నెల నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, మొత్తం జిల్లాకు సుమారు 14,000 ఇళ్లు మంజూరు కానున్నాయని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Next Story