- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, షాద్ నగర్: వైద్యారోగ్య శాఖలో బాధ్యాతాయుతమైన హోదాలో ఉన్న డాక్టర్ ఆయన. కింది స్థాయి సిబ్బందితో ఎంతో గౌరవ మర్యాదలతో మెలగాల్సిన ఆయన విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని మహిళా సిబ్బంది ఆరోపిస్తున్నారు. డాక్టర్ వేధింపులపై విసుగు చెందిన సదరు మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం రంగారెడ్డి జిల్లా వైద్య శాఖలో కలకలం రేపుతున్నది. వేధింపులపై ప్రశ్నిస్తే.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా సిబ్బంది వాపోతున్నారు. డాక్టర్ విచిత్ర ప్రవర్తనతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఫ్యూటీ డీఎంహెచ్ వో సైతం మహిళా ఉద్యోగి అయినప్పటికీ.. శాడిస్ట్ డాక్టర్ ను వెనుకేసుకు రావడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రాఘవేందర్ పై వెల్లువెత్తుతున్న వేధింపుల ఆరోపణలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది చర్చనీయాంశంగా మారింది.
అసభ్య మాటలు.. వెకిలి చేష్టలు..
బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాఘవేందర్ మహిళా సిబ్బందిని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఏఎన్‌ఎంలు, ఎంఎల్ హెచ్ పీలు రంగారెడ్డి జిల్లా డీహెచ్‌ఎంవోకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు నిర్ణయించిన టార్గెట్లను పూర్తి చేసినప్పటికీ డాక్టర్ తమతో అగౌరవంగా మాట్లాడుతున్నారని.. వస్త్రధారణ, వ్యక్తిత్వం గురించి అసభ్యంగా డబుల్ మీనింగ్ మాటలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమావేశాల పేరుతో తమను గంటల తరబడి పీహెచ్ సీలో ఉంచేవారని, అతని అసభ్య ప్రవర్తనతో పీహెచ్ సీకి రావాలంటేనే భయం అవుతుందని మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ ల పేరుతో వాష్ రూమ్ కు వెళ్లేందుకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. హాజరు పట్టికలో సంతకం చేయకుండా రిజిస్టర్ ను దాచిపెట్టడమే కాకుండా.. ఆబ్ సెంట్ వేసి వేధిస్తున్నారని మహిళా సిబ్బంది చెబుతున్నారు. డాక్టర్ వెకిలి చేష్టలతో కొందరు సిబ్బంది బదిలీ చేయించుకొని వెళ్లిపోగా.. ఒక ఉద్యోగి రాజీనామా కూడా చేశారని పేర్కొంటున్నారు. డాక్టర్ చేతలకు అడ్డు చెప్పిన సిబ్బందిపై అట్రాసిటీ కేసులు పెట్టిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ వేధింపులతో తాము కూడా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని అనుకుంటున్నామని చెబుతున్నారు. డాక్టర్ తీరుపై షాద్ నగర్ డిఫ్యూటీ డీఎంహెచ్ వో జయలక్ష్మికి గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. చర్యలు తీసుకోకపోగా.. సర్దుకుపోవాలి అన్నట్లుగా డిఫ్యూటీ డీఎంహెచ్ వో మాట్లాడడం తమను మరింత బాధకు గురి చేస్తోందని మహిళా సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి డాక్టర్ రాఘవేందర్ తోపాటు షాద్ నగర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ ఓ జయలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని బూర్గుల పీహెచ్ సీ పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఎంఎల్ హెచ్ పీలు, ఆశవర్కర్లు కోరుతున్నారు.
ఏ విచారణకైనా సిద్ధమే : డాక్టర్ రాఘవేందర్
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమే. పని విషయంలో ఖచ్చితంగా ఉండడం వల్లే బూర్గుల పీహెచ్ సీ పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఎంఎల్ హెచ్ పీలు, ఆశ వర్కర్లు తనపై ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఒక్కసారికి వదిలేయండి : జయలక్ష్మి, డిఫ్యూటీ డీఎంహెచ్ వో
డాక్టర్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాఘవేందర్ పై వచ్చిన ఆరోపణల విషయంలో ఈ ఒక్కసారి వదిలేయాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.






