రాగన్నగూడ లో మహిళా సంఘాల భవనం కూల్చివేత

by Taduka Kalyani |

ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడలో మహిళా సంఘం భవనానికి చెందిన ప్రహరీ గోడలను ఆదిభట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం కూల్చివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాగన్నగూడ లో మహిళా సంఘాల భవనం కూల్చివేత
X

దిశ, తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడలో మహిళా సంఘం భవనానికి చెందిన ప్రహరీ గోడలను ఆదిభట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం కూల్చివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా ఈ చర్య చేపట్టారని ఆరోపిస్తూ అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల క్రితం రాగన్నగూడలో గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించబడిందని, అనంతరం గ్రామ జనాభా పెరగడంతో కార్యాలయం ఇరుకుగా మారడంతో అప్పటి సర్పంచ్ రొక్కం భీమ్‌రెడ్డి మరో ప్రాంతంలో కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. దీంతో పాత భవనాన్ని మహిళా సంఘాల అవసరాల కోసం వినియోగించేందుకు అప్పగించారు. గత 25 ఏళ్లుగా 50 నుంచి 60 మహిళా పొదుపు సంఘాలు ఈ భవనంలో సమావేశాలు నిర్వహిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఉగాది పంచాంగ శ్రవణం, మహిళా సంఘాల సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ భవనం కేంద్రంగా నిలిచిందన్నారు. ఇటీవల రాగన్నగూడలో పోస్టాఫీస్ కొనసాగింపునకు మహిళా సంఘాలు, గ్రామస్థుల అంగీకారంతో ఈ భవనాన్ని పోస్టాఫీస్‌కు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామస్తులే సొంత నిధులతో ప్రహారీ గోడతో పాటు అదనపు గదులను నిర్మించి, భవనాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరుతో కొందరు వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు మహిళా సంఘం ప్రహరీ గోడలను కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపించారు. కాలనీలో ఇప్పటికే పలు రహదారులు అందుబాటులో ఉన్నాయని, ఈ స్థలం రోడ్డు విస్తరణకు అత్యవసరం కాదని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్న స్థలాన్ని పరిరక్షించాలని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story