- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగానికి చెక్.. క్లిక్ చేయండి.. ఉద్యోగం పొందండి..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అందుబాటులోకి తెచ్చిన డీట్ (డీఈఈట్) యాప్ పోర్టల్ నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అందుబాటులోకి తెచ్చిన డీట్ (డీఈఈట్) యాప్ పోర్టల్ నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్న ఈ యాప్‌ను మీ మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకొని ఎన్ రోల్ అయితే చాలు మీ అర్హతకు తగ్గ ఉద్యోగ వివరాలు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ యాప్‌ను జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న చాలా మంది నిరుద్యోగులు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు రాక, కనీసం ప్రైవేట్ సంస్థలు లేదా పరిశ్రమలలోనైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుందామని ఉద్యోగ అన్వేషణ చేస్తుంటారు. కానీ ఎవరిని అడగాలో తెలియక, ఏ సంస్థలో ఖాళీలున్నాయి.. ఎలా సంప్రదించాలన్నది చాలా మందికి తెలియదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు పంపించిన దరఖాస్తులను ఆయా సంస్థలు పరిశీలించి వారికి కావాల్సిన ఉద్యోగాల భర్తీ కోసం సదరు సభ్యులకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా సమాచారమిచ్చి ఎంపిక చేసుకుంటారు. 10వ తరగతి నుంచి పీజీ ఆపై చదివిన వారు.. వివిధ ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు కూడా ఉద్యోగాలకు ఈ యాప్ ఉపయోగించవచ్చు.
నూతన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఏఐ టెక్నాలజీ ఆధారంగా డీట్ యాప్ తయారు చేసి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంది. గతేడాది డిసెంబర్‌లోనే డీట్ ప్రారంభించినా కొంత ప్రచారం లేక చాలా మందికి ఈ యాప్‌పై అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు డీట్ కు సంబంధించిన పోస్టర్లు ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాలలో అక్కడక్కడా అతికించడంతో చాలా మంది నిరుద్యోగ యువకులు మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉద్యోగాలిచ్చే 1134 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఉద్యోగాల కోసం లక్ష మందికి పైగా నిరుద్యోగులు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 12 సంస్థలు నమోదవగా, 1,450 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఎన్‌రోల్‌మెంట్ ఇలా..
ఉద్యోగాలు కల్పించే సంస్థలతో పాటు ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ ఇలా ఏదేని కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్నవారు రిజిస్ట్రేషన్ వెసులుబాటు ఉంది. డీట్ యాప్‌లో లేదా deet.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, సెల్ నెంబరు, మెయిల్ ఐడీ, జిల్లా తదితర వివరాలు తప్పనిసరి గా నమోదు చేయాలి. విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర సాంకేతిక విద్యార్హత, అనుభవం, ఏ రంగం ఆశిస్తున్నారు.. నైపుణ్యాలు.. ఇలా అన్ని నమోదు చేసి సంబంధిత ధ్రువపత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. ప్రక్రియ మొత్తం మీకు కావాల్సిన అవకాశాలు చెంతకు వస్తాయి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి, సదరు సంస్థకు కావలసిన అర్హతలు ఉన్న అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అవసరంతో ఉద్యోగాలు కనిపిస్తున్నారు. ఈ యాప్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుండడంతో నకిలీ కంపెనీలకు తావులేకుండా మోసాలకు గురికాకుండా ఉంటుందని సూచిస్తున్నారు.
ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలి : మహేశ్వర్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి
తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో కొనసాగుతున్న డీఈఈటీ పోర్టల్‌లో జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఎన్‌రోల్ చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో 12 సంస్థలు నమోదవగా, 1,450 మంది ఎన్‌రోల్ అయ్యారు. మీ విద్యార్హత అలాగే ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమ రంగాల్లో మీరు కోరుకున్న ఉద్యోగాలు పొందేందుకు డీట్ యాప్ మంచి వేదిక. కావున జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.






