జిల్లాలో కార్యకర్తల కన్ఫ్యూజన్.. మేము ఏ పార్టీలో కొనసాగాలి...?

by Disha Web Desk 23 |
జిల్లాలో కార్యకర్తల కన్ఫ్యూజన్.. మేము ఏ పార్టీలో కొనసాగాలి...?
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీల చేరారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రంజిత్ రెడ్డి అభిమానులు పూర్తి కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇంతకు మేము ఏ పార్టీలో కొనసాగుతున్నట్లు..? ఇకపై ఏ పార్టీలో కొనసాగాలి...? మేము ఎవరికి ఓటు వేయాలి..? ప్రజలతో ఎవరికి ఓటు వేయించాలి..? అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ప్రారంభం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు రంజిత్ రెడ్డి పోతే మాకేంటి, మాకు మా పార్టీ, మా నాయకులు కేసీఆర్, కేటీఆర్ లు ముఖ్యం అంటున్నారు.

కానీ పార్టీతో పాటు గత 5 ఏళ్లలో రంజిత్ రెడ్డి పై నమ్మకం పెట్టుకున్న, ఆయనను అభిమానించే వీరాభిమానుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ లోపల రంజిత్ రెడ్డికి ఓటు వేసి పార్టీని మోసం చేయలేము. అలా అని పార్టీ మారుదామా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్న కార్యకర్తలు మనల్ని పార్టీలోకి రానిచ్చేలా లేరు. ఒకవేళ రంజిత్ రెడ్డి ఆహ్వానించినా సరైన గౌరవం దక్కకపోగా, పైనుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్నటి వరకు మా నాయకుడిని ఓడించడానికి కంకణం కట్టుకుని పనిచేసిన మీరు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని పార్టీలోకి వచ్చారు అని అవమానిస్తారు.

నాయకుడు అవమానాలు తట్టుకుంటాడు కానీ ఒక నిజమైన కార్యకర్త మాత్రం అవమానాలు అస్సలు తట్టుకోలేడు. ఇలాంటి వారు ఇప్పుడు ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితికి వస్తే వారి సమస్య మరోలా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ నాయకుడిని ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి, చేవెళ్ల పార్లమెంట్ టికెట్ తీసుకున్నంత మాత్రాన తనని ఓటు వేసి గెలిపించాలా..? అని మదన పడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వ్యక్తి ఎవరు అనేది పక్కన పెట్టి మనకు చేవెళ్ల పార్లమెంట్ సీటు గెలవడమే ముఖ్యం అంటూ లోలోపల కార్యకర్తలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చెప్పినా రంజిత్ రెడ్డి కి ఓటు వేయాలంటే మాత్రం మా మనసు ఒప్పుకోవడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి కన్ఫ్యూజన్ లో పడ్డారు.

గల్లంతైన రాజకీయ భవిష్యత్..!

జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు కొద్దిసేపు పక్కన పెడితే నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఇన్ని రోజులు నిజాయితీగా పని చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ గానో లేదా ఉప సర్పంచ్, చివరికి వార్డు మెంబర్ గానో రాజకీయ భవిష్యత్తు ప్రారంభిద్దాం అని చాలామంది కార్యకర్తలు ఎన్నో కలలు కన్నారు. కానీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం తో పూర్తిగా మా ఆశలన్నీ గల్లంతయ్యాయని అంటున్నారు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్ లు ఓడిపోయారు. అయినా ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడుగా ఆయనను ఎంపీగా గెలిపించుకొని రాజకీయంగా ఎదుగుదాం అని అందరూ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ చివరికి వారి ఆశలపై నీళ్లు చల్లిన రంజిత్ రెడ్డి కేవలం తన స్వార్థం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని మమ్మల్ని రోడ్డున పడేశాడని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీలో చేరకపోయిన సోషల్ మీడియాలో రంజిత్ రెడ్డి పోస్టులు పెడుతూ అందరి చేత అవమానాలు పడుతున్నారు. అయినా కూడా చేసేదిలేక సర్దుకు పోతున్నారు. అలాంటి వారినైనా రంజిత్ రెడ్డి త్వరలోనే పార్టీలోకి ఆహ్వానించాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా రెండు పార్టీల కార్యకర్తల కన్ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అర్థం కాక, కార్యకర్తకు కోపం వస్తే ఏం జరుగుతుందో తమ ఓటు హక్కుతో చూపిద్దామని ఎన్నికల సమయం కోసం ఎదురుచూస్తున్నారు.


Next Story

Most Viewed