బాలరాజు వెంట వంద మంది చేరితేనే రూ. 100 మెంబర్​షిప్​ఇస్తాం: రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్

బాలరాజు వెంట వంద మంది చేరితేనే రూ. 100 మెంబర్​షిప్​ఇస్తాం: రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంత‌రం గువ్వల బాల‌రాజుకు బీజేపీ స‌భ్యత్వం రాంచందర్​రావు అంద‌జేశారు. ఇది సాధారణ సభ్యత్వమని, బాలరాజు వెంట 100 మంది చేరితేనే ఆయ‌న‌కు రూ. 100 మెంబ‌ర్‌షిప్ ఇస్తామ‌ని ప్రక‌టించారు. దీంతో గువ్వల బాల‌రాజు క‌నీసం వంద మంది కార్యకర్తలతో కూడా బీజేపీలో చేర‌లేద‌ని స్పష్టంగా స్వయానా రాంచంద‌ర్ రావు పేర్కొనడం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గువ్వల బాలరాజు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. గువ్వల బాలరాజు న్యాయవాది. ఎల్‌.ఎల్‌.బిలో పీహెచ్‌డీ పొందారు. 2014, 2019లో రెండుసార్లు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతోంది. బాలరాజు దాన్ని గుర్తించి, మోడీ బడగు, బలహీన వర్గాల ప్రజలకు, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు వెల్లడించారు.

అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్‌ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తారని నమ్ముతూ పార్టీలో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 శాతం ఓటుశాతం సాధించగా, 2024 పార్లమెంట్‌ న్నికల్లో 36 శాతానికి పైగా ఓటుశాతం పెరిగిందన్నారు. బీజేపీ తెలంగాణలో క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.హైదరాబాద్‌లో వానలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చిన్నపాటి వానకే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్లపై దృష్టి పెట్టడం కంటే, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌పై దృష్టి పెట్టి హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో బీజేపీకి తెలంగాణ గేట్‌వే ఆఫ్‌ తెలంగాణ అవుతుందని, దానికి గువ్వల బాలరాజు పార్టీలో చేరడం నిదర్శమన్నారు. ఎక్కడికెళ్లినా ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వంటి అనేకమంది పార్టీలో చేరారు. అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనం తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలన ప్రజలను విసిగించాయి. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసినా, 19 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గత రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను మోసం చేశాయి. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

తెలంగాణను కాంగ్రెస్​, బీఆర్​ఎస్​పార్టీలు దోపిడీ చేస్తున్నాయి : గువ్వల బాలరాజు

దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని వీరి దోపిడీని అరికట్టడానికి బీజేపీ పోరాటాలు చేస్తోందన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన దేశానికి ఒక ఆర్కిటెక్చర్‌ను అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక ఇంపోర్ట్ లీడర్షిప్ కలిగిన పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్‌లో దళిత వర్గాలకు చోటులేదని, తాను అవకాశవాది కాదని అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని అని ధీమా వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్‌లో చేరమని తనని ఎవరు అడగలేదని, తానే స్వరాష్ట్రం ఉద్యమం కోసం వెళ్లానని చెప్పారు. రాజకీయంగా తనకు అచ్చంపేట జన్మనిచ్చిందని, కానీ అక్కడి ప్రజలకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు క్షమించాలని కోరారు. రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ నుంచి కూడా పిలుపు వచ్చిందని అక్కడ దోపీడి ఎక్కువ జరుగుతుందని అందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. పార్టీలో తాను ఒక సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభిస్తానని, నిబద్ధతతో కూడిన కార్యకర్తగా బీఆర్ఎస్‌లో పనిచేసనని కానీ అక్కడ క్రెడిబిలిటీ లేని రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు భిక్ష ఇచ్చిందని కానీ కేసీఆర్ ఎవరికి భిక్ష ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుస్తారని ఎవరి భిక్షతో విజయం సాదించరని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమి కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేశారని విమర్శించారు. బీజేపీలో చేరుతానంటే తనపై, తన సతీమణిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ అధికారం కావాలనీ చూస్తోంది, కాంగ్రెస్ మళ్ళీ రెన్యువల్ కావాలని చూస్తోందన్నారు. ఏది కావాలన్న ఎన్నికలు రావాలని ఏదైనా ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అచ్చంపేట నుంచే ప్రారంభమైతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , ఆచారీ , గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , శాంతి కుమార్ , ఎన్.వి.సుభాష్ , సోలంకి శ్రీనివాస్ , కట్టా సుధాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీపాచారి , జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story