నాలుగేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. జయరాం హత్య కేసులో దోషి అతనే!

by Disha Web Desk 2 |
నాలుగేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. జయరాం హత్య కేసులో దోషి అతనే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా రియల్టర్ రాకేష్‌రెడ్డిని దోషిగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రాకేష్‌రెడ్డే జయరాంను కుట్ర చేసి హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో మరో 11 మంది నిందితులపై న్యాయస్థానం కేసు కొట్టేసింది. ఏసీపీ మల్లారెడ్డి, మరో ఇద్దరు సీఐలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

ఈనెల 9వ తేదీన రాకేష్‌రెడ్డి శిక్షను ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న సినీ ఫక్కీలో జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగేండ్ల తరువాత ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియల్టర్ రాకేష్‌రెడ్డి, ముగ్గురు పోలీసులు సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. 73 మంది సాక్షులను విచారించారు. 2019 జూన్ 10న నాంపల్లి 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అందులో రాకేష్‌రెడ్డి సహా ముగ్గురు పోలీసులు మరో 8 మంది నిందితులపై అభియోగాలు పొందుపరిచారు.

జయరాం హత్య తరువాత డెడ్ బాడీని తరలించేందుకు పోలీసులు సహకరించారని కోర్టుకు తెలిపారు. ఇందులో నల్లకుంట మాజీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్ స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు దాఖలు చేశారు. కాగా, మాజీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు, మాజీ ఏసీపీ మల్లారెడ్డిలపై చార్జిషీట్ దాఖలు కావడంతో నాలుగేళ్ల క్రితం వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Next Story