Raja Singh: నిన్న కొండా.. నేడు రాజాసింగ్.. తెలంగాణ బీజేపీలో ఫుట్ బాల్ రాజకీయం

by Prasad Jukanti |   (  Updated:2025-08-27 06:51:29  IST  )

11 ఏళ్లుగా నాతోనూ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని రాజాసింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raja Singh: నిన్న కొండా.. నేడు రాజాసింగ్.. తెలంగాణ బీజేపీలో ఫుట్ బాల్ రాజకీయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో ఫుట్ బాల్ రాజకీయం (Foot ball Politics) కాక రేపుతోంది. పార్టీలో తనతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న స్టేట్ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీకీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ గా ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల్లోని సీనియర్ నాయకులు సైతం పార్టీలోని పెద్ద నాయకులకు ఫుట్ బాల్స్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

పార్టీని ముంచేశారు:

మంచి పేరున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఫుట్ బాల్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చని రాజాసింగ్ అన్నారు. పార్టీ నేతలు తనతో ఫుట్ బాల్ ఆడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మా బాధ కూడా ఇదే కదా? 11 ఏళ్లుగా నేను కూడా ఇదే బాధపడుతున్నానని నాతో రాష్ట్ర నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. నా మనిషి, నీ మనిషి, ఇంటి వ్యక్తి, బయటి వ్యక్తి అంటూ నాతో బంతాటా ఆడుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కాదని పార్టీలో ఉన్న ఒకరికొకరితోనే పోటీ ఉందని హాట్ కామెంట్ చేశారు. తామేమి పదవులు ఆశించలేదు, మా నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలనే కిషన్ రెడ్డిని అడిగామన్నారు. కానీ మా నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మనుషులను పెట్టారని ఇక్కడ వారికేం పని అని ప్రశ్నించారు. నేను అనుభవిస్తున్న బాధనే పార్టీలోని అనేక మంది సీనియర్ నాయకులు అనుభవిస్తున్నారని కానీ కొంత మంది మాత్రమే ధైర్యం చేసి ముందుకు వస్తున్నారన్నారని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీకి కాపాడాలని పార్టీ జాతీయ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

సొంత కార్యకర్తలు ఉండగా బయటివారెందుకు?

బీజేపీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రామచందర్ రావు అంటున్నారు. అసలు వారిని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. బయటి వారి కోసం బీజేపీ ఎందుకు ఎదురు చూడాలి? ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవల్ నుంచి సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. మన కార్యకర్తలకే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులుగా చేద్దామనే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బయటి నుంచి నేతల గురించి ఎదురు చూస్తే బీజేపీలో కార్యకర్తలు లేరా? అని మండిపడ్డారు. సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూలీల మాదిరిగా పని చేయడమేనా? వారిగిరించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు. పాత బీజేపీ కార్యకర్తలు, లీడర్లకు ఆర్థికంగా సహకరించి ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసం ఉందని.. రాజాసింగ్ చెబుతున్నది ఇదే కదా అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న బీజేపీని నీ మనిషి నామనిషి అంటూ ముంచేశారని ధ్వజమెత్తారు.

Next Story