- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలి: ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజం
రాష్ట్రంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను రాహుల్ గాంధీ ఆపాలని కామెంట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాగిస్తున్న దుర్మార్గాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆపాలని మల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవనం పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఏదైనా అభివృద్ధి పనులు చేయదలుచుకుంటే పేదల జీవితాలతో చలగాటం ఆడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రస్తుతం ప్రభుత్వానికి అర్థం కాకపోవచ్చు కానీ, భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈటల అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వు..
‘గాంధీ సరోవర్’ పేరుతో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ట చేయడం బాగానే ఉంది కానీ.. గత మూడు, నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) బకాయిలు క్లియర్ చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరిగోస పడుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు శేష జీవితాన్ని హాయిగా గడపాల్సిన రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benefits) కోసం సెక్రటేరియట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే రూ.వేల కోట్లతో గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఖమ్మంలో కోర్టు ఆదేశాలతోనే ఇళ్ల కూల్చివేతలు చేపడుతున్నామని కలెక్టర్ చెబుతున్నారని.. కోర్టులు కూడా నిరుపేదల విషయంలో ఆలోచన చేసి తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈటల అభిప్రాయపడ్డారు.
పెద్దల జోలికి ‘హైడ్రా’ ఎందుకు వెళ్లడం లేదు?
మధు రిజ్డ్ అపార్ట్‌మెంట్ (Madhu Ritz Apartment) వాసులకు తాము అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్న దుర్మార్గాలను రాహుల్ గాంధీ తక్షణమే ఆపాలని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూల్చివేతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పెద్ద నాయకుల జోలికి ‘హైడ్రా’ (HYDRAA) ఎందుకు వెళ్లడం లేదో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 40, 50 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని, అటువంటి ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు. బాధితులకు తాము తప్పకుండా అండగా ఉండి తీరుతామని ఈటల స్పష్టం చేశారు.






