వరంగల్‌లో రాహుల్ పాదయాత్ర.. యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీ

by Disha Web Desk 4 |
వరంగల్‌లో రాహుల్ పాదయాత్ర..  యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ నేతలను ఒక్కతాటిపైకి రావాలని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అర్బన్​ నుంచి యూత్​, రూరల్ నుంచి రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపైనే ప్రధానంగా గళం వినిపించేందుకు కాంగ్రెస్​ ప్లాన్​ సిద్ధమైంది. రాహుల్​ గాంధీ టూర్​ నేపథ్యంలో అటు పార్టీ వ్యూహకర్త సునీల్​ కనుగోలు గ్రౌండ్​ రిపోర్ట్​ రెడీ చేస్తున్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం నోటిఫికేషన్లను ప్రకటించినా.. ఇంకా నిరుద్యోగుల్లో అసంతృప్తి వస్తూనే ఉండటంతో నిరుద్యోగ యువతే లక్ష్యంగా రాహుల్​ సమావేశం నిర్వహించనున్నారు.

యూనివర్సిటీ నుంచి ర్యాలీ

కాంగ్రెస్​ అగ్రనేత పర్యటనలో పలు మార్పులు చేపట్టారు. ఒకేసారి అన్ని వర్గాలే లక్ష్యంగా రాహుల్​ పర్యటన ఉండాలని ఏఐసీసీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. మే నెల 6,7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటన ఉండగా.. ముందుగా వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. 'రైతు సంఘర్షణ సభ' పేరుతో నిర్వహించనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివస్తారని నేతలు భావిస్తున్నారు. అదేరోజు రాష్ట్రానికి రానున్న రాహుల్​ గాంధీ.. ప్రత్యేక హెలికాప్టర్​లో కాకతీయ యూనివర్సిటీలో దిగనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు రాహుల్​ వస్తారని, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి సభా వేదిక వరకు యువత, విద్యార్థులతో కలిసి పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సుమారు 4 కిలోమీటర్లు రాహుల్​ నడువనున్నారు. ఆ మరునాడు హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలనే విషయాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.

పట్టు కోసం

ముఖ్యంగా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా... అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టమవుతున్నా దాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవుతున్నది. ఈ మేరకు రాష్ట్రంలో పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు రాహుల్​ గాంధీ నడుం బిగించడం పట్ల శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. నిజానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్నది. పార్టీ క్రియాశీల సభ్యత్వం విషయంలో టీపీసీసీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ మేరకు సమర్థ నాయకత్వమూ ఉంది. అన్నీ ఉన్నా అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి కారణంగా పార్టీ వెనకబడిపోతున్నదని గ్రహించిన అధినాయకత్వం స్వయంగా రంగంలోకి దిగుతుండటం విశేషం.

పోరుబాట లక్ష్యంగా

రాహుల్​ టూర్​ రెండు వైపులా కలిసి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు విశ్లేసిస్తున్నాయి. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని ఇప్పటికే సైలెంట్​ చేసిన రాహుల్​.. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే క్షేత్రస్థాయి అంశాలన్నీ మరింత సద్దుమణుగుతాయంటున్నారు. ఇప్పటికీ వేర్వేరుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సీనియర్లు రాహుల్​ సభ నేపథ్యంలో కలిసివచ్చే చాన్స్ ఉంది. రాహుల్​ టూర్​ వార్నింగ్​ తరహాలోనే ఉండనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాహుల్​ ట్వీట్​ తర్వాత రాష్ట్ర నేతలు చెలరేగిపోయారు. నిరసనలకు దిగారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ అంశంలో దిగి వచ్చింది. కొనుగోళ్లకు రెడీ అయ్యింది. నిరుద్యోగ సమస్యే లక్ష్యంగా యువతను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్​ నేత మానవతారాయ్​ నేతృత్వంలో నిరుద్యోగులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలకు దిగారు. అటు కేయూలోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటి నుంచే అధికార టీఆర్​ఎస్​ వైఫల్యాలపై ముప్పేట దాడి చేస్తే వచ్చే ఎన్నికల్లో సులువుగా గెలుపొందొచ్చని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది.

సునీల్​ గ్రౌండ్​ రిపోర్ట్​

రాహుల్​ పర్యటన ఉంటుందనే సమాచారంతో ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు​ టీమ్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. నిరుద్యోగులు, యువతకు సంబంధించిన స్పెషల్​ రిపోర్ట్​ను సిద్ధం చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నా.. ఇంకా రైతుల సమస్యలు, వచ్చే వానాకాలానికి వరిసాగు, ఉచిత ఎరువులు, మద్దతు ధర వంటి అంశాలపై సునీల్​ బృందం ఫోకస్ పెట్టింది. దీనితో పాటుగా పార్టీలో ఇంకా చల్లారని అసంతృప్తిపైనా నివేదిక సిద్ధం చేసింది. యువత, రైతు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై వరంగల్​ సభ వేదికగా ప్రస్తావిస్తే.. పార్టీ అంతర్గత సమస్యలు, నేతల వైఖరిపై బోయినపల్లి సభా వేదికగా రాహుల్​ చర్చించనున్నారు.

వరంగల్​కు కాంగ్రెస్​ నేతల బాట

రాహుల్​ టూర్​ ఖరారు కావడంతో టీపీసీసీ, ఏఐసీసీ నేతలు వరంగల్​ బాట పట్టారు. అల్రెడీ ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్​ మహేశ్వర్​రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్​ మధుయాష్కీతో పాటుగా ఎమ్మెల్యేలు, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్లు మూడు రోజుల ముందు నుంచే పర్యటిస్తున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, స్టార్​ క్యాంపెయినర్​, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తదితరులు వరంగల్​ వెళ్లారు. సభా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. రాహుల్​ పర్యటనకు ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఓ ఇన్ చార్జిని నియమిస్తున్నారు.



Next Story

Most Viewed