Raghunandan Rao: మనదే అధికారం బీజేపీలోకి తిరిగి రండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-07 11:23:40  IST  )

గతంలో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీలో చేరాలని ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Raghunandan Rao: మనదే అధికారం బీజేపీలోకి తిరిగి రండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ (BRS Party), రెండేళ్ల కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఇక రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అందువల్ల బీజేపీని వీడిన వారు తిరిగి వెనక్కి రావాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా వైపు నుంచి జరిగిన ఒకటి అర సంఘటనల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప ఇది కాంగ్రెస్ బలమో, రేవంత్ రెడ్డి పోరాటం కాదన్నారు. బీజేపీ అధికారానికి మరో 10 అడుగుల దూరంలో ఉందనగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి నాయకులు వేర్వేరు కారణాలతో బీజేపీని వీడటంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‍కు వలసపోయిన నాయకులకు అక్కడ ఏం గుర్తింపు ఉందో ఓసారి ఆలోచన చేసుకోండి. మీకు అక్కడ ఏం లాభం జరుగుతుందో ఆలోచించుకోండి. భవిష్యత్‍లో తెలంగాణ సమాజం కోసం నిలబడేది బీజేపీ మాత్రమేనని అందువల్ల బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరిన వారు తిరిగి బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ సొంత కుటుంబానికే భారం అయింది:

బీజేపీలో పాత కొత్త లీడర్లు అనే మాట ఉండదని కండువా కప్పుకున్న నాటి నుంచే వారు మా కుటుంబం అన్నారు. పాత కొత్త అనేది కేవలం మీడియా సృష్టే అన్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఇష్టపడి పనిచేసేవారినందరిని స్వాగతిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయిందని, ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు భారం అయిందన్నారు. వాళ్ల సొంత కుటుంబ సభ్యులకే ఆ పార్టీ భారంగా మారింది. అందుకే తలోదారిలో వెళ్తున్నారు. మిగిలింది తెలంగాణకోసం కొట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు.

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు:

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Telangana Assembly) మొక్కుబడిగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బాయ్‍కాట్ చేశారో వారికైనా అర్థమైందా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నూటికి నూరు శాతం విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మా సార్ లేస్తే ఎలా ఉంటుందో చూడాలన్నారు. కానీ సభ అయిపోయినా సార్ ఇంకా లేవ్వలేదు, సభకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు అంటాం. అలాంటిది కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర శాసనసభలో మంచి చర్చ జరిపి ఈ పదేళ్లలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సి పాలక పక్షం మీనమేషాలు లెక్కిస్తే, మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్లు సభ నుంచి పారిపోయారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ ఎందుకు తోకముడిచింది?:

ఐదురోజుల సభలో కృష్ణా జలాలు, హిల్ట్ భూములపై ప్రధానంగా చర్చ జరిగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు తోకముడుచుకు పారిపోయిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. సభలో బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉన్నాం. ఉన్న ఎనిమిది మంది మా సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు గట్టిగా కొట్లాడామన్నారు. ఈ సందర్భంగా మా బీజేపీ శాసనసభా పక్ష నేతను, సభ్యులను అభినందిస్తున్నానన్నారు. ఎంత మందిమి ఉన్నామన్నది కాదు పాలక పక్షాన్ని ఎలా నిలదీశామన్నదే ముఖ్యం అన్నారు. ఎంఐఎం అధికారంలో ఎవరుంటే వారికి తొత్తులుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు అని ప్రజాసమస్యలపై పోరాడాల్సి వస్తే కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ప్రజా గొంతుకగా నిలబడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. భవిష్యత్ లో ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా మాకే అవకాశం ఇవ్వాలని కోరారు.

సీఎం మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేలు ఉండరా?:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 20 మంది ఎమ్మెల్యేలు కూడా సభలో లేరని ఇది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. రేవంత్ రెడ్డినో, కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కృష్ణజలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సభలో చర్చ జరుగుతుంటే రేవంత్ రెడ్డి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన చోట 20 మంది కూడా లేరని సెటైర్ వేశారు. అధికార పక్షం తప్పులు చేస్తే నిలదీయాల్సిన ప్రతిపక్షం వ్యక్తిగత పంతాలు, పట్టింపులకు పోయి సభ నుంచి పారిపోయారు. అంటే పాలమూరుపై ఇటు రేవంత్ రెడ్డికి అటు కేసీఆర్‍కు పట్టింపు లేదని దుయ్యబట్టారు. వీరి పట్టింపల్లా నువ్వెంత అంటే నేనెంత అనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్‍లో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్ఐటి కాస్త సీఐటిగా మార్చారు:

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా నడుస్తోందని ఒకటో సిట్ అయిపోయి రెండో సిట్ వచ్చిందని భవిష్యత్‍లో మూడు, నాలుగో సిట్లు వచ్చేటట్లు ఉందని విమర్శించారు. కేసు దర్యాప్తు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టేలా కనిపించడం లేదన్నారు. ఊరికేనే గంటల తరబడి ప్రశ్నిస్తున్నామని టీవీలకు బ్రేకింగ్‍లు ఇస్తున్నారని విమర్శించారు. సాంకేతిక ఆధారాలు లేకుండా ఎన్ని గంటలు ప్రశ్నిస్తే ఏం లాభం అన్నారు. మొబైల్ నెట్ వర్క్ సంస్థలను ప్రశ్నించి ఎవరెవరి నంబర్లు ట్యాప్ చేయమని చెప్పారని నోటీసులు ఇస్తే సరి కదా అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నా ఫోన్ ట్యాపింగ్ కు గురైందన్న రేవంత్ రెడ్డి సీఎం కాగానే తన ఫోన్ ట్యాప్ అయితే సిట్ పిలిచేది కదా అని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడారు సీఎంగా ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు. ఈ కేసులో అందరి వేళ్లు కేసీఆర్ వైపు చూపిస్తే ఆ ఒక్కడి అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) కాస్తా కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటి) గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఒక నటుడి సినిమాకు ఒక రూల్ మరో నటుడి సినిమాకు మరో రూల్ ఎలా ఉంటుందన్నారు.

Next Story