- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రంలో రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలకు ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలకు ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023 లో మార్చ్‌లో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్, 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2029-30 సంవత్సరం నాటికి ఎంత మేరకు విద్యుత్‌డిమాండ్ పెరుగుతుంది, అదే విధంగా 2030 -35, అలాగే 2047 సంవత్సరాలకు ఏర్పడే విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసీ నదీ పునర్జీవనం, రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగనున్న విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంచనాలు రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ..
రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తుందని, ఇందుకు గాను ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు సంవత్సరానికి రూ. 12,500 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. నిరుపేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం వీటి విలువ 2 వేల కోట్ల వరకు ఉందని, అది భవిష్యత్తులో పెరిగి మూడు వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని మొత్తంగా ఉచిత విద్యుత్ పథకాలకు భవిష్యత్తులో 17 వేల కోట్ల వరకు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన వివరించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ఈ పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువస్తు మొత్తం సోలార్ పంపు సెట్లు వినియోగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క వెల్లడించారు. 2030-31 నుండి 2035 నాటికి థర్మల్ విద్యుత్తు కు ఉండే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాల క్రితం నిర్మించిన రామగుండం, కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ల స్థానంలో కొత్తవి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో 2019 లోనే మూసి వేసారని, అక్కడ 500 ఎకరాల స్థలం, బొగ్గు అందుబాటులో ఉన్న నేపథ్యంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అక్కడ అవకాశం ఉందని డిప్యూటీ సీఎం సూచించారు. కాగా , 62.5 మెగావాట్ల సామర్థ్యంతో నిజాం కాలంలో ఏర్పాటుచేసిన రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాలం చెల్లిపోవడంతో మూసి వేశామని, అక్కడే 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో డైరెక్టర్లు అందుకు తగిన విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు. అందరి దృష్టి ప్రస్తుతం తెలంగాణ
సాంప్రదాయేతర ఇంధన శాఖ రెడ్కో పైనే ఉందని, తెలంగాణ రెడ్ కో దేశానికి రోల్ మోడల్ గా నిలవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనిచేసేందుకు రెడ్కోకు కావలసిన సిబ్బంది, ఏ స్థాయి సిబ్బంది కావాలో సవివరంగా ఓ నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు రెడ్కోకు ఉంటుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. డైరెక్టర్లు అందరికీ కావలసినంత స్వేచ్ఛను ఇస్తున్నామని, ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలను పూర్తి చేయండని విద్యుత్ శాఖ అభివృద్ధికి కావాల్సిన ఆలోచనలు చేయండని ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన డైరెక్టర్లను కోరారు. దావోస్‌లో హైదరాబాదులో, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి ఒప్పందలపై రోజువారీ సమీక్ష చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఆదాయంతో పాటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ, జెన్కో రెండు శాఖలను సమన్వయం చేసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎం డి కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి హరీష్, రెడ్కో వీసీ ఎండీ అనిలా తదితరులు పాల్గొన్నారు.
- Tags
- bhatti vikramaka






