నగరానికి రానున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి.. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష

by Kema Shiva Kumar |

భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

నగరానికి రానున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి.. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా నోడల్ ఆఫిసన్లను నియమించి నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 16న మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనేటి విందులో పాల్గొని రామోజీ ఫిల్మ్ సిటీ‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతారని వెల్లడించారు. బ్లూ బుక్, VVIP ప్రొటోకాల్ మాన్యువల్‌ ప్రకారం తగు భద్రతా, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్త్ ప్రణాళికను పోలీస్ శాఖ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వివిఐపిలకు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. జీఏడీ, ఫైర్ సర్వీస్, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, మున్సిపల్, ఇంధన, బీఎస్ఎన్‌ఎల్, హార్టి‌కల్చర్ విభాగాలు నిర్దేశించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఈనెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. రాజ్‌భవన్‌లో స్వల్ప విరామం తీసుకుని అక్కడే బస చేసి రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రాత్రి రాజ్ భవన్‌లో బస చేసి ఈనెల 22న ఉదయం పుట్టపర్తి పర్యటనకు బయలుదేరుతారని సీఎస్ వెల్లడించారు. అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డీజీపీలు విజయ్ కుమార్, మహేష్ భగవత్, GHMC కమిషనర్ ఆర్.వి.కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ శివలింగయ్య, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story