ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

by Naga Rani Yarlagadda |

సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు.. ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు.. ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు సవాల్ విసిరిన మంత్రి పొంగులేటి.. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందన్నారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.

జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని, మే 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

'రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు .. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదు. సవాల్‌కు సిద్ధమేనా కేటీఆర్ గారు?' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story