కొత్త ఏడాది నీళ్ల పంచాయతీతో పాలిటిక్స్ షురూ.. పరస్పర ఆరోపణలతో దద్దరిల్లనున్న అసెంబ్లీ

by Kema Shiva Kumar |

రాష్ట్ర రాజకీయాలు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రసవత్తరంగా సాగనున్నాయి.

కొత్త ఏడాది నీళ్ల పంచాయతీతో పాలిటిక్స్ షురూ.. పరస్పర ఆరోపణలతో దద్దరిల్లనున్న అసెంబ్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రసవత్తరంగా సాగనున్నాయి. నది జలాలపై పోరాటానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఫల్యాలు అంటూ బీఆర్ఎస్ ఉద్యమాలు, బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నది. త్వరలోనే తేదీలనూ వెల్లడించనున్నది. ఈ నేపథ్యంలో నీళ్లు.. నిజాలు పేరుతో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. అందులో భాగంగా ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై మొదట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వారి సందేహాలను పార్టీ పెద్దలు నివృత్తి చేయనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపేందుకు ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ అందించనున్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారుల క్రిస్మస్ సెలవులను సైతం రద్దు చేసి సమగ్ర వివరాలను తయారు చేయిస్తున్నారు. గత ప్రభుత్వం సంతకాలు చేసిన డాక్యుమెంట్స్, జీవోలు, సర్క్యులర్లు, కేంద్రానికి రాసిన లేఖలు ఇలా పూర్తి వివరాలు, వాటికి ఆధారాలను బయటపెట్టి ప్రజాప్రతినిధులకు అందించనున్నారు. నది జలాలపై వచ్చే నెల 1న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు ప్రజాభవన్‌లో ఓరియేంటేషన్ ఇవ్వనున్నారు. గోదావరి, కృష్ణా నది జలాలు, ప్రాజెక్టుల కేటాయింపులు, పూర్తైన ప్రాజెక్టులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్, ప్రస్తుతం కొనసాగుతున్న ట్రిబ్యునల్ వాదనలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరణ ఎప్పుడయిందనే వివరాలను తెలియజేయనున్నారు. అనంతరం 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

కృష్ణా నుంచి 290 టీఎంసీలకు మించలేదు

కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 34శాతం నీళ్లను రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఏనాడూ వాడుకున్న దాఖలాలు లేవు. కృష్ణా నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్టు నిర్మాణాలు ఏవీ పూర్తిస్థాయిలో కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మహబూబ్​నగర్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టున్ని పూర్తయితే మరో 240 టీఎంసీలు వాడుకోవడానికి చాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బీమాకు 20 టీఎంసీల నికర జలాలు ఉండగా మిగిలిన వాటికి నీటి కేటాయింపులు అధికారికంగా లేవు. ఎస్ఎల్‌బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 53 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు, దిండీకి 30 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలు ఇలా అన్నిటిని కలిపితే 240 టీఎంసీలకు వరకు ఉండనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఏపీ పోతిరెడ్డిపాడును పెద్దగా చేస్తూ బెసిన్‌తో సంబంధంలేకుండా నీటిని పెద్దఎత్తున తరలిస్తోంది. ఈ విషయాలను అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ గరిష్ఠంగా పుష్కర కాలంలో 286 టీఎంసీలు అత్యధికంగా వాడినట్లుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ అత్యధికంగా 718 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించినట్టు సీడబ్ల్యుసీ స్పష్టం చేసింది.

Next Story