రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెక్ట్స్ లెవెల్! ప్రధాన ప్రతిపక్షంపై కాంగ్రెస్ దూకుడు

by Kema Shiva Kumar |

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఒక్కసారిగా గేర్ మార్చింది.

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెక్ట్స్ లెవెల్! ప్రధాన ప్రతిపక్షంపై కాంగ్రెస్ దూకుడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గురువారం విభిన్న దృశ్యం కనిపించింది. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే సాగుతుండగా, ఈసారి అది క్షేత్ర స్థాయి పోరాటంగా మారింది. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేయగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గన్‌పార్క్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులపై కేటీఆర్ చేసిన సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చి తాను సిద్ధమని ప్రకటించారు.

ఈ పరిణామాల మధ్య నలుగురు మంత్రులు సవాళ్లను స్వీకరించి గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు అక్కడ బైఠాయించి చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించగా, హరీశ్ రావు గన్‌పార్క్‌కు చేరుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకుని తన సవాల్‌పై చర్చకు సిద్ధమని తెలిపారు. మొత్తంగా మంత్రులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రులు ఈ స్థాయిలో ఫీల్డ్‌లోకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చురుకుగా వ్యవహరించడం కాంగ్రెస్ దూకుడు పెరిగిందనే సంకేతాలను ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story