బండి పాదయాత్రకు పోలీసుల షాక్.. చివరి రోజు అలర్ట్!

by Disha Web Desk |
బండి పాదయాత్రకు పోలీసుల షాక్.. చివరి రోజు అలర్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బండి సంజయ్ చేపడుతున్న నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర పై బాలానగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాత్రలో నిబంధనలు ఉల్లంఘించినట్లు బాలానగర్ ఏసీపీ పేరిట నోటీసులు ఇచ్చినట్లు పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారని చెప్పారు. పాదయాత్ర ద్వారా బీజేపీకి వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తమకు న్యాయ పోరాటం కొత్తేమీ కాదని, గతంలో అలా చేసి సాధించుకున్న అంశాలు బోలెడన్ని ఉన్నాయన్నారు. పాదయాత్రలో డీజే, అధిక సంఖ్యలో మోటార్ సైకిళ్లను వినియోగించారని, రాత్రి పొద్దుపోయేదాకా పాదయాత్ర చేశారనే విచిత్రమైన అంశాలను జోడించారని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎందరో పాదయాత్రలు చేసినా ఇలాంటి అడ్డంకులు ఎవరూ సృష్టించలేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇలా చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి తొలి మూడు పాదయాత్రలకు తమకు లిఖిత పూర్వకంగా అనుమతి ఇవ్వనేలేదని, మౌఖిక అనుమతులు మాత్రమే ఇచ్చారని ఆయన వెల్లడించారు. మూడో విడుత యాత్రలో కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టి యాత్రను అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు నాలుగో విడుత పూర్తయ్యే క్రమంలో నోటీసులు అందించడంపై ఫైరయ్యారు. కేసీఆర్ ఫ్రభుత్వం ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తోందని, అయినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలో 5వ విడత పాదయాత్ర షెడ్యూల్ ను కూడా ప్రకటిస్తామన్నారు. పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు యాత్రను అడ్డుకోవాలని చూస్తే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

Also Read: ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఆ దమ్ము లేదంటున్న కేటీఆర్


Next Story

Most Viewed