- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరాల్లోనూ వాడిన ‘గులాబీ’.. పురపీఠాలపై ఎగిరిన కాంగ్రెస్ జెండా
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసకుని అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. మూడు వారాల నుంచి జరుగుతున్న ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ అత్యధిక చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్‌లతో మొత్తం 92 స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 11 మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. హంగ్, స్పష్టమైన మోజార్టీ లేని మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే మున్సిపల్కార్యాలయాలకు పార్టీ కేడర్‌లు చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్జిల్లా తొర్రూరులో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇరువర్గాలను బుజ్జగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ ఆధిపత్యం
మరోవైపు జనగామ, చౌటుప్పల్‌తో పాటు స్పష్టమైన మెజార్టీ రాని దగ్గర అన్ని చోట్లా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాంతో అక్కడ ఎన్నికలను నేటికి వాయిదా వేశారు. ఇక ఎన్నికలు సజావుగా సాగడంతో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్న దగ్గర పార్టీ కేడర్, నాయకులు ర్యాలీలు తీస్తూ సంబురాలు చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ కరీంనగర్ మినహా మిగిలిన కార్పొరేషన్లు అన్నింటినీ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మేయర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ (ఎంఐఎం) పార్టీలు దక్కించుకున్నాయి. కొత్తగూడెంలో సీపీఐతో పొత్తు పెట్టుకొని మేయర్(సీపీఐ), డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) పార్టీలు పాగా వేశాయి. మిగిలిన రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ కార్పొరేషన్‌లలో భారీ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది.
బీఆర్ఎస్ 17..
బీఆర్ఎస్ మొత్తం 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎల్లంపేట, అలంపూర్, జమ్మికుంట, సిరిసిల్ల, ఇస్నాపూర్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, రాయికల్, అసిఫాబాద్, అయిజ, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, మూడుచింతలపల్లి, చేర్యాల, తిరుమలగిరి స్థానాలున్నాయి.
బీజేపీకి మూడు స్థానాలు..
భారతీయ జనతా పార్టీ 3 పట్టణ స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నది. ఇందులో కరీంనగర్కార్పొరేషన్ఒకటి. కాగా, మరో రెండు నారాయణ్‌పేట్, బైంసా మున్సిపాలిటీలున్నాయి. ఇండిపెండెంట్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా బైంసా స్థానాన్ని కాషాయ పార్టీ దక్కించుకున్నది.
11 చోట్ల నేడు ఎన్నిక..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు, రాజకీయ పార్టీల అభ్యంతరాలు, ఎన్నిక నిర్వహించడానికి అవసరమైన ‘కోరం’ లేకపోవడంతో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వీటి ఎన్నిక నేడు జరగనుంది. ఇప్పటికే సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం కూడా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకుంటే, కోరంకు అవసరమైన సభ్యులు రాకుంటే, తిరిగి మరో తేదీన సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఆ రోజు ఎంతమంది వస్తే వారితోనే ఎన్నిక నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్‌లు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. వాయిదాపడిన వాటిల్లో అత్యధికంగా ఏ పార్టీకి స్పష్టమైన మోజార్టీలేని మున్సిపాలిటీలే ఉన్నాయి. దీంతో అక్కడ పొత్తులు కుదరకపోవడం, ఇతర పార్టీల్లోని సభ్యులకు గాలం వేయడం, ఒత్తిళ్లు వంటి తదితర కారణాలున్నట్లు సమాచారం.






