కొలిక్కివచ్చిన పీసీసీ కార్యవర్గ ఏర్పాటు.. మరో మూడు రోజుల్లో ప్రకటించే చాన్స్

by Kema Shiva Kumar |

టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

కొలిక్కివచ్చిన పీసీసీ కార్యవర్గ ఏర్పాటు.. మరో మూడు రోజుల్లో ప్రకటించే చాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఒకటీ, రెండు రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశముంది. బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్ల జాబితాను అందజేయగా, ముగ్గురు కమిటీ ఎంపికపై చర్చించినట్లుగా తెలిసింది. సామాజికవర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు, పార్టీలో పాత, కొత్త వారు, సీనియార్టీ, సిన్సియార్టీని పరిగణలోకి తీసుకొని పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

జంబో కమిటీనే..

పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పీసీసీ నియామకం కొలిక్కి రాలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పీసీసీ కూర్పు పూర్తి అయింది. గత పీసీసీలో 122 మంది ప్రధాన కార్యదర్శులు, 57 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. అయితే పార్టీ అధికారంలో లేనప్పటి కంటే తక్కువ మందితోనే కమిటీని రూపకల్పన చేసినా.. వంద మందికిపైగా సభ్యులతో ప్రస్తుతం జంబో కమిటీగానే ఉండనున్నట్లు సమాచారం. కొత్తగా ప్రకటించబోయే కమిటీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు ఉండనున్నారు. ఐదుగురితో క్రమశిక్షణ కమిటీ, పీఏసీని మార్పుచేర్పులతో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కొత్తగా పది మంది సూపర్ సీనియర్లతో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సంవిధాన్ బచావో కమిటీని సైతం నియమిస్తున్నట్లు తెలిసింది. పీసీసీలో సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం పీసీసీ ద్వారా డీసీసీ అధ్యక్షులను సైతం నియమించనున్నారు.

Next Story