- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PCC Chief: పీసీసీ చీఫ్@100 డేస్.. నేతలను సమన్వయం చేయడంలో మహేశ్‌కుమార్ గౌడ్ సక్సెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రకటించి వంద రోజులు పూర్తయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రకటించి వంద రోజులు పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబరు 6న పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, మహేశ్ గౌడ్ మాత్రం సెప్టెంబరు 15న అధికారికంగా గాంధీభవన్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది జూలై 7తో ప్రస్తుత సీఎం, మాజీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డే కొనసాగారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, ఏఐసీసీ, ఢిల్లీ అగ్రనాయకత్వంతో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధం కలిగిన నేతలంతా పీసీసీ చీఫ్ పోస్టు కోసం గట్టిగానే ట్రై చేశారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం తమదైన శైలిలో ట్రై చేశారు.
కానీ, అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలో ఉన్న మహేశ్ గౌడ్ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. 30 ఏండ్లకు పైగా పార్టీకి సేవలందించిన మహేశ్ గౌడ్‌ను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించింది. సీఎం రేవంత్ కూడా పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్‌నే నియమించాలని హైకమాండ్‌కు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో క్రీయాశీలక పాత్ర పోషించిన మహేశ్ గౌడ్‌కు అన్ని వర్గాల సపోర్టు లభించడం, అగ్రనాయకత్వం ఆశీస్సులతో పీసీసీ చీఫ్ కుర్చీలో కుర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గం నేత సీఎంగా ఉన్నందున, పీసీసీ చీఫ్ బీసీకే ఇవ్వాలని హైకమాండ్ ఆలోచించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఈక్వేషన్‌తో కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చిందని సీనియర్ నేతలు వివరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ, పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్‌ను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
కీలక నిర్ణయాలు.. పార్టీలో క్రీయాశీలక పాత్ర
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించే రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నందున కార్యకర్తల శ్రమను గౌరవించాలని, వాళ్ల కష్టంతో దక్కిన పదవులకు న్యాయం చేయాలని సీఎం, కేబినెట్ మంత్రులకు ప్రమాణ స్వీకరణ బాధ్యతలు తీసుకునే వేదిక సాక్షిగానే మహేశ్ గౌడ్ సూచించారు. కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ప్రకటించారు. సీఎంతో సహా మంత్రులంతా అంగీకరించారు. ఈ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం వారంలో రెండు సార్లు గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం సజావుగా జరుగుతున్నది. ఈ ప్రోగ్రామ్ పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతనే నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సమస్యలతో పాటు సాధారణ పబ్లిక్ గ్రీవెన్స్‌ను కూడా నేరుగా మినిస్టర్లే అడ్రస్ చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు, పార్టీ పెద్దలకు కనెక్టివిటీ పెరుగుతున్నదని పార్టీ లీడర్లు చెప్తున్నారు. తద్వారా ఆటోమేటిక్‌గా పార్టీపై ప్రజల్లో మరింత మైలేజ్ పెరుగుతున్నది.
లీడర్లకు పదవులపై భరోసా
నూతన కార్యవర్గం ఎంపిక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జిల్లా టూర్లకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి.. పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీలు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తున్న జిల్లా నేతలు, వివిధ కమిటీలతో వరుసగా భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, కార్యకర్తల వెల్ఫేర్ వంటి వాటిపై చర్చించి భవిష్యత్‌లో పదవులపై భరోసా ఇస్తూ వచ్చారు. దీని వల్ల పార్టీ డిస్ట్రబ్ కాదనేది ఆయన అభిప్రాయం. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మిగతా జిల్లాల్లోనూ టీపీసీసీ చీఫ్ పర్యటించనున్నారు.
నేతల మధ్య సమన్వయానికి చొరవ
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత.. పార్టీని సమన్వయం చేయడంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు, లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్పటికే ఇన్‌చార్జిగా ఉన్న లీడర్లు, వాళ్ల టీమ్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకత్వాన్ని అంగీకరించలేదు. దీంతో సమన్వయం లోపించి పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆందోళన, గొడవలకు కారణమయ్యాయి. దీన్ని గమనించిన పీసీసీ చీఫ్ నేరుగా ఆయా నేతలతో సంప్రదింపులు జరిగి, డిస్కషన్ సమసిపోయేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ వివాదాస్పద సెగ్మెంట్లలో పీసీసీ చీఫ్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు.
గాంధీభవన్ వేదికగా నిత్యం అందుబాటులో..
పీసీసీ అధ్యక్షుడిగా నిత్యం గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటూ.. కార్యకర్తల సమస్యలే కాకుండా, ప్రజల ఇష్యూస్‌ను కూడా అడ్రస్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించినవి ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌తో, ప్రభుత్వానివి సీఎంతో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. మంత్రులనూ కోఆర్డినేట్ చేస్తున్నారు. గాంధీభవన్‌కు వచ్చిన ప్రతి ఇష్యూను పరిష్కరించే విధంగా పీసీసీ చీఫ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా పెండింగ్‌లోని జీవో 41, జీవో 29 సమస్యలు, జనరల్ ట్రాన్స్‌ఫర్స్ వంటి అంశాలను సర్కారు దృష్టికి తీసుకువెళ్లేందుకు క్రీయాశీలకంగా పనిచేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. ‘తాను రాహుల్‌గాంధీ పంపిన బాణం’ అంటూ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.






