నేను లెఫ్టిస్టునీ, రైటిస్టునీ కాదు: పవన్ కల్యాణ్ క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-03 15:47:56  IST  )

తెలంగాణలో తెగింపు, దైర్యం, పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదని పవన్ కల్యాణ్ అన్నారు.

నేను లెఫ్టిస్టునీ, రైటిస్టునీ కాదు: పవన్ కల్యాణ్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తెగింపు, దైర్యం, పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు. అలాంటి యువతకు బలమైన సిద్ధాంతం తోడైతే ఎదురుండదు. జనసేన(Janasena) ఏడు మూల సిద్ధాంతాలు మీ అందరికీ బలాన్నిస్తాయి. మీరంతా సమర్ధవంతంగా పని చేస్తే ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన పార్టీ కీలక పార్టీగా అవతరిస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. జన సైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలని, తెలంగాణలో పార్టీ నిర్మాణం అనేది వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. శివ అనే చెంచు యువకుడు సైద్ధాంతిక బలంతో ముందుకు కదిలితే సమస్య ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కదిలించింది... నాకు డబ్బు ఉన్న నాయకులు కాదు... శివ లాంటి దమ్మున్న నాయకులే కావాలని చెప్పారు. నాకు బలహీనమైన వ్యక్తులు వేల మంది అవసరం లేదనీ, పార్టీ కోసం బలంగా నిలబడే 150 మంది చాలన్నారు. కొండగట్టు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “తెలంగాణలో కలల ఖనిజాలతో చేసిన యువత పుష్కలంగా ఉంది. అలాంటి యువతకు సైద్ధాంతిక బలాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గెలుపు, ఓటమి గురించి ఎవరూ ఆలోచించవద్దు. తెలంగాణకు మీరంతా భవిష్యత్తు కావాలి. మీ సమర్ధతే మీ విజయానికి బాటలు వేస్తుంది. నా అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా వచ్చి మాట్లాడుతా. నాకు పోరాట స్ఫూర్తి ఇచ్చిన నేల తెలంగాణ. ఇది దైవం పట్ల, దేశం పట్ల భక్తి చూపిన నేల. అలాంటి నేలలో పుట్టిన పార్టీ జనసేన. ఇదే నేల నాకు పునర్జన్మ నిచ్చింది. హైటెన్షన్ వైర్లు తలకి తాకితే పది నిమిషాలు స్పృహ కోల్పోయా. ఆ ఘటన జరగడానికి 4 నెలల ముందే ఎవరో వచ్చి మృత్యుగండం ఉందని చెబితే భగవంతుడి మీద భారం వేసి వదిలేశా. నాకు ఈ కొండగట్టు పునర్జన్మనిచ్చింది. రాజకీయాల్లోకి నేను ఎలాంటి పదవులు ఆశించి రాలేదు. నేను పుట్టిన నేలకు, దేశానికి సేవ చేయాలనే వచ్చా.

అడవి తల్లి బాటకు ఆదిలాబాద్ స్ఫూర్తినిచ్చింది

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే పార్టీ పెట్టా. అప్పట్లో ఇక్కడ నాయకత్వం కూడా నిప్పు కణికల్లా ఉండేవారు. మీరంతా అలాగే ఉండాలి. పంచాయతీ ఎన్నికల్లో 143 మంది పోటీ చేస్తే 53 మంది గెలిచారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్లు వేసే అడవి తల్లిబాట కార్యక్రమానికి కూడా మన ఆదిలాబాదే స్ఫూర్తిచ్చింది. నల్లమలకి చెందిన శివ అనే ఇంటర్ చదివే చెంచు యువకుడు యురేనియం తవ్వకాల కారణంగా మా ఊళ్లు దెబ్బతింటున్నాయని నా వద్దకు వస్తే.. అది చివరికి అన్ని పార్టీలు కలసి మీటింగ్ పెట్టేలా చేసింది. చివరికి ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు నిలిపివేశారు. సిద్ధాంతాన్ని నమ్మి ఒక యువకుడు కదిలితే అది ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. తెలంగాణ యువత తాలూకు శక్తి అది. పార్టీ నాయకత్వం అంతా అలాగే ఆలోచిస్తే మార్పు వచ్చి తీరుతుంది. శివ లాంటి వారు గ్రామానికి ఒకరు తయారైతే దేశం బాగుపడుతుంది. ఇక్కడ ఉన్న యువత మొత్తం తలచుకుంటే బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది. మీరు నిలబడండి. నేను మీకు అండగా ఉంటాను.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో తెలంగాణకు మేలు

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు పెరిగితే ఇక్కడ ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఇక్కడకు వలసలు ఆగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో తెలంగాణ యువతకు మేలు జరుగుతుంది. ఈ రాష్ట్రానికీ మంచి జరుగుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ దృష్టి సారించా. మా ప్రాంతంలో మాకు ఎక్కువ అవకాశాలు ఉండాలి అన్న భావన న్యాయ సమ్మతం. అయితే ప్రాంతాల మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలు దేశ సమగ్రతను దెబ్బతీయకూడదు. నేను దేశం కోసమే పని చేస్తున్నాను. జనసేన పార్టీ మూల సిద్ధాంతం ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అందరు అలవరుచుకోవాలి. మన రాష్ట్రం మనకి కావాలి. అదే సమయంలో మన రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగమన్న విషయాన్ని గుర్తించాలి. ఖుషీ చిత్రంలో హిందీ పాట పెట్టడం అది నేను ఆ భాషకు ఇచ్చే గౌరవం.

నేను లెఫ్టిస్టునీ, రైటిస్టునీ కాదు.. సెంట్రలిస్టుని..

సిద్ధాంతపరంగా లెప్టో, రైటో ఏదో ఒకటి తేల్చుకోవడం చాలా తేలిక. బ్యాలెన్స్ గా నిలబడడం కష్టం. అలా నిలబడడం నేను తెలంగాణ సాయుధపోరాటం నుంచి నేర్చుకున్నాను. నన్ను విమర్శించే వారు.. నాకంటూ ఓ సిద్ధాంతం లేదంటారు. నేను సెంట్రలిస్టుని. కమ్యునిస్టు, మార్కిస్టు దేశం అయిన చైనానే క్యాపిటలిస్టుగా మారిపోయింది. ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడే ఉండకూడదు అన్నది వామపక్ష సిద్ధాంతం. కమ్యునిస్టు దేశం చైనానే క్యాపిటలిస్టుగా మారిపోయినప్పుడు అలాంటి సిద్ధాంతాలు సాధ్యపడతాయా? నాతో ఎంతో సన్నిహితంగా ఉండే గద్దరన్న సైద్ధాంతికంగా మాత్రం నాతో ఏకీభవించే వారు కాదు. జనసేన పార్టీతో నేను సెంట్రలిస్ట్ సిద్ధాంతాన్ని ఒక ఎక్సపెర్మెంట్ గా తీసుకుని ముందుకు వెళ్లా. అది పని చేయడం వల్లే నేను ఉపముఖ్యమంత్రి అయ్యాను. కమ్యునిస్టు చైనా క్యాపిటలిస్ట్ అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదు అనిపించింది. అంతేకాదు గద్దర్ లాంటి వారు జీవిత చరమాంకంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెలుపల కూర్చుని పాటలు కూడా పాడారు. నక్సలిజం పేరిట యువత చనిపోతుంటే బాధ కలుగుతుంది. అలాంటి యువత పంచాయతీ స్థాయిలో బలంగా నిలబడితే దోపిడీకి ఆస్కారం లేని ప్రగతి సాధ్యపడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రాష్ట్రం కోసం జరిగిన పోరాటం వరకు నేను తెలంగాణ తాలూకు ఆత్మను ఆర్ధం చేసుకున్నాను. రాష్ట్రం కోసం ఇంత మంది రోడ్ల మీదకు రావడం, శ్రీకాంతాచారి లాంటి వారి బలిదానాలు ఇక్కడ యువత ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత బలంగా నిలబడతారో చూపింది. మీ అందరిలో బలమైన మార్పుని ఆశిస్తున్నా.

నేను రాజ్యాంగానికి మాత్రమే కొమ్ము కాస్తా...

సనాతన ధర్మం స్థానికంగా ఉండే సంస్కృతి ఆధారంగా ఉంటుంది. దేశంలో మెజారిటీ శాతం ప్రజలు పాటించే హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన నేను ఇస్లాంను వ్యతిరేకించినట్టు కాదు. నేను ఏ వర్గానికి, మతానికి కొమ్ముకాయను. రాజ్యాంగానికి మాత్రమే కొమ్ముకాస్తాను. సెక్యులరిజం అంటే హిందువులను తిట్టడం కాదు. ముస్లింలలోనూ నన్ను ప్రేమించే వారు ఉన్నారు. నేను ఏ మతాన్ని ద్వేషించను. హిందూ దేవుళ్లపై చేస్తున్న అసత్య ప్రచారాలు తప్పు అన్నందుకు నా మీద మత ముద్ర వేసేస్తారు. అలాంటి పద్దతి మారాలి" అన్నారు.

Next Story