‘లోకల్’ ఫైట్‌లకు పార్టీలు సన్నద్ధం.. క్యాష్ పార్టీ క్యాండిడేట్ల కోసం వేట షురూ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో స్థానిక పోరు త్వరలో జరగనున్నదనే ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి.

‘లోకల్’ ఫైట్‌లకు పార్టీలు సన్నద్ధం.. క్యాష్ పార్టీ క్యాండిడేట్ల కోసం వేట షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక పోరు త్వరలో జరగనున్నదనే ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. అంగబలం, ఆర్థిక బలం ఉన్న నేతల కోసం పల్లెలు వదిలి పట్టణాల్లో జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లో నివసించే నేతలు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో పట్టణాలకు వలస వచ్చి ఇసుక, రియల్​ఎస్టేట్, భవన నిర్మాణాలు చేసే గుత్తేదార్లలతో మంతనాలు జరుపుతున్నారు. ఏ పార్టీకి పనిచేయక పోయినా వారిని చేర్చుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్దిగా నిలబడాలని కోరుతున్నారు. గత వారం రోజులుగా గ్రామాలనుంచి సీనియర్​నేతలు పట్టణాలకు వెళ్లి, ఆర్ధికంగా బలమున్న నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఈసారిటికెట్​ఇస్తామని, రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేయాలని, పార్టీ ప్రచారమంతా తామే చూసుకుంటామని చెబుతున్నారు. వారం రోజుల పాటు ఊరిలో ఉంటే సరిపోతుందని వారికి నచ్చజెబుతూ తమ వైపు తిప్పకునే ప్రయత్నిం చేస్తున్నారని తెలుస్తోంది.

వారు ప్రచారానికే పరిమితం

పల్లెల్లో జీవిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరిస్తున్న నేతలు ప్రజా ప్రతినిధులుగా మారాలనుకున్నా అది కలగానే మిగిలిపోతోంది. ఆర్ధికంగా బలంగా లేని సీనియర్లు సైతం వెనక్కి తగ్గే పరిస్ధితి నెలకొంది. ఎన్నికల్లో నిలబడితే లిక్కర్, నగదు పంపిణీతో పాటు సెకండ్​క్యాడర్​నేతలు ప్రచారం చేసినందుకు వారికి రూ. 50 వేల వరకు నగదు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు భారీగా నగదు ఇస్తే గెలుపు సహకరిస్తామని కొందరు రాజకీయాలు నడుపుతున్నారు.

బిల్డర్లు, రియాల్టర్లకు గాలం

పట్టణాల్లో నివసిస్తూ ఇసుక, రియల్​ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో స్దిర పడిన వారిని టార్గెట్​గా పెట్టుకుని నిత్యం సంప్రదిస్తూ ఈసారి ఎన్నికల్లో నిలబడాలని, గెలిపించే బాద్యత తమదేనని చెబుతూ, పలువురిని తమవైపు తిప్పుకుంటున్నారు. మరి కొందరు ఆర్ధిక బలం ఉంటే సరిపోదని, రాజకీయంగా ఎదిగితే ఇంతకు రెండింతలు సంపాదించుకోవడంతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని నచ్చచెబుతున్నట్లు తెలిసింది. ఊరిలో ఎలాంటి అభివృద్ధి పనులైనా, తాము చూసుకుంటామని వారానికి ఒకసారి వచ్చి ప్రజలను పలకరిస్తే సరిపోతుందని చెబుతూ బడాబాబులను ఆకర్షిస్తున్నారు.

నిజమైన కార్యకర్తలు అధికారానికి దూరం

రాజకీయ పార్టీల గెలుపు కోసం తొడగొట్టి, సవాల్​చేసే స్ధానిక నేతలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో మార్పు రాకుంటే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు అధికారానికి దూరంగా ఉండక తప్పదని అంటున్నారు. ఓట్లకు నోటు పంపిణీ చేయకుండా ఎన్నికల అధికారులు కఠిన చట్టాలు తీసుకొస్తే, కొద్దిగానైనా ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story