- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు అవకాశం.. స్మాల్ హైడ్రో ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయం: రూ. 2,584 కోట్లతో కొత్త పథకం
దేశవ్యాప్తంగా 1 మెగావాట్ నుండి 25 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల (స్మాల్ హైడ్రో పవర్) అభివృద్ధి కోసం స్మాల్ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీం అమలుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా 1 మెగావాట్ నుండి 25 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల (స్మాల్ హైడ్రో పవర్) అభివృద్ధి కోసం స్మాల్ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీం అమలుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను రూ. 2,584.60 కోట్ల భారీ బడ్జెట్ అవుట్‌లేతో ఈ పథకం అమలు కానుంది. దీని ద్వారా దేశంలో దాదాపు 1,500 మెగావాట్ల అదనపు జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. నిర్మాణ దశలో 51 లక్షల పనిదినాల ఉపాధిని, 9,000 శాశ్వత ఉద్యోగాలను సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఏటా సుమారు 43 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని రక్షించవచ్చని అంచనా వేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ఈ పథకానికి జాతీయ కార్యక్రమ అమలు సంస్థగా (ఎన్పీఐఏ) వ్యవహరిస్తుంది. మొత్తం బడ్జెట్‌లో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల కేంద్ర ఆర్థిక సహాయం (సీఎఫ్ఏ) కోసమే రూ. 2,532.60 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద తెలంగాణ సహా ఇతర సాధారణ రాష్ట్రాల్లో నిర్మించే 1 నుండి 5 మెగావాట్ల ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ. 1.78 కోట్లు, 5 నుండి 25 మెగావాట్ల ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ. 2.054 కోట్ల చొప్పున 20 శాతం నిధుల సబ్సిడీ (గరిష్టంగా ప్రాజెక్టుకు రూ. 20 కోట్లు) లభిస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దులు గల జిల్లాల్లోని ప్రాజెక్టులకు 30 శాతం వరకు (గరిష్టంగా రూ. 30 కోట్లు) కేంద్ర సహాయం అందుతుంది. మార్చి 18, 2026 తర్వాత పారదర్శకమైన పోటీ వేలం ద్వారా కేటాయించి, నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టులు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. అర్హులైన డెవలపర్లు కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ (https://nrep.mnre.gov.in/shp-home) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో డిసెంబర్ 31, 2030 వరకు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రాజెక్టులను నిర్మాణ ప్రారంభం నుండి 4 ఏళ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆలస్యమైతే సబ్సిడీలో కోత విధిస్తారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం వల్ల చిన్న జల విద్యుత్ కేంద్రాల కొనుగోలు ఖర్చు (టారిఫ్) తగ్గి డిస్కాంలపై భారం తగ్గుతుందని, తద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది.






