పాత నేరస్థుల కదలికలపై నిఘా.. సైబర్‌ నేరగాళ్లపై ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ 2.0

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన 'ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0' సంచలనం సృష్టిస్తోంది.

పాత నేరస్థుల కదలికలపై నిఘా.. సైబర్‌ నేరగాళ్లపై ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ 2.0
X
  • రంగంలోకి 300 పోలీసు బృందాలు..
  • 335 మంది వివరాల ఆరా.. 115 మంది పరారీ..
  • జైలు నుంచి వచ్చినా వదిలిపెట్టం.. టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌..

దిశ, తెలంగాణ బ్యూరో : సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్‌బీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. గతంలో సైబర్ నేరాలకు పాల్పడి అరెస్టయిన పాత నేరస్థులు.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే బాట పట్టకుండా వారిపై నిరంతర నిఘా ఉంచేందుకు ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0 కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0 ద్వారా సైబర్ నేరగాళ్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ స్పష్టం చేశారు. ఒకసారి అరెస్టు అయి జైలు నుంచి బయటకు వచ్చినా సైబర్ నేరస్థులు ఎప్పటికీ పోలీసుల రాడార్‌లోనే ఉంటారని ఆమె హెచ్చరించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతున్నామని, సైబర్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని ఆమె అన్నారు. బెయిల్‌పై బయట ఉన్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు.. ఏం చేస్తున్నారు.. మళ్లీ పాత సంబంధాలను కొనసాగిస్తున్నారా? అనే వివరాలను పక్కాగా సేకరించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టం. సైబర్ నేరాల చరిత్రలో అరెస్టు తర్వాత ఇంత భారీ స్థాయిలో ఫాలో అప్ నిఘా కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ పోలీసుల చరిత్రలో ఇదే తొలిసారి అని అమె అన్నారు.

టీజీసీఎస్‌బీ రికార్డుల ప్రకారం 2024-2025 సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,567 మంది సైబర్ నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 614 మంది ఉన్నారు. ఈ జాబితా నుంచి బహుళ నేరాలతో సంబంధం ఉన్న, భారీ ఆర్థిక సైబర్ మోసాలకు పాల్పడిన ఎంపిక చేసిన నిందితుల వివరాలను పోలీసులు సిద్ధం చేశారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరించేందుకు టీజీసీఎస్‌బీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిపి ఏకంగా 300 బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు. భౌతిక తనిఖీలు, ఇంటింటి సర్వే ద్వారా నిందితుల ప్రస్తుత చిరునామాలను నిర్ధారించుకోవడంతో పాటు, వారు ఉంటున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వారి ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కార్యకలాపాలపై నిఘా ఉంచడం, ఎవరితో సంబంధాలు నెరుపుతున్నారో ఆరా తీయడం, బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా లేదా అని పరిశీలించడం వంటి ఐదు వ్యూహాత్మక అంశాల ఆధారంగా ఈ తనిఖీలు సాగుతున్నాయి. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 335 మంది పాత నేరస్థుల వివరాలను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ 335 మందిపై తెలంగాణలో 480 కేసులు, దేశవ్యాప్తంగా 1,233 కేసులు ఉండటం గమనార్హం. వీరిలో 218 మంది ఆచూకీ లభ్యమైంది. కొందరు పాత చిరునామాల్లోనే ఉంటుండగా, మరికొందరు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు. అయితే, 115 మంది నేరగాళ్లు ప్రస్తుత చిరునామాల్లో లేరని, అజ్ఞాతంలోకి వెళ్లారని తేలడంతో, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరో ముగ్గురు నిందితులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదే తనిఖీల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్‌లో ఉన్న నాంకింగ్ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తూ సీసీపీఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో నమోదైన ఓ కేసులో అరెస్టయిన ప్రసాద్ కుమార్ 30 అనే నిందితుడు ఏకంగా నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో నేరస్థుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నా, మళ్లీ పాత నెట్‌వర్క్‌తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలినా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం వారిపై వెంటనే సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story