పకడ్బందీగా ఆపరేషన్ ఆహాత్.. రైల్వే రాష్ట్రస్థాయి సెక్యూరిటీ కమిటీ కీలక సమావేశం

by Ramesh Naini |

దొంగతనాలు, మరణాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ సరఫరా, వంటి నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డా. జితేందర్ తెలిపారు.

పకడ్బందీగా ఆపరేషన్ ఆహాత్.. రైల్వే రాష్ట్రస్థాయి సెక్యూరిటీ కమిటీ కీలక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దొంగతనాలు, మరణాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ సరఫరా, వంటి నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించే ముందు వారి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, మానవ అక్రమ రవాణా పై తలపెట్టిన ఆపరేషన్ ఆహత్ (Operation Aahat) కొనసాగించాలన్నారు. నేరస్తులకు సంబంధించిన చార్జ్ షీట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శుక్రవారం రైల్వే రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ కమిటీ సమావేశం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు. డీజీపీ జితేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ డీజీపీ (పర్సనల్ ) అనిల్ కుమార్ , రోడ్ సేఫ్టీ రైల్వే ఐజీపీ రమేష్ నాయుడు, రైల్వేస్ ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, ఐ ఎస్ డబ్ల్యూ ఓ ఎస్ డి కమలాసన్ రెడ్డి, రైల్వేస్ ఎస్పీ చందనా దీప్తి, ఆర్ పి ఎఫ్ ఎస్పీ నవీన్ , ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ రాధీ, రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజర్ సిహెచ్ కరుణాకర్ రావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

రైల్వేల భద్రత గురించి జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం విస్తృత స్థాయిలో సీసీటీవీ కెమెరాలను వినియోగించాలని తద్వారా దొంగతనాలను, డ్రగ్ సరఫరాలను పసిగట్ట వచ్చని డీజీపీ అన్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారుల మధ్య తరచూ సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే వారిపై గ్యాంగ్స్ ఫైల్స్ నేరాల కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Next Story