- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో కేవలం వారికే పాలియేటివ్ కేర్ సేవలు: MP అసదుద్దీన్
దేశంలో కేవలం వారికే పాలియేటివ్ కేర్ సేవలు: MP అసదుద్దీన్

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఏటా సుమారు 1 కోటి మంది రోగులకు పాలియేటివ్ కేర్ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిందని.. అయితే అందులో కేవలం 4 శాతం మందికే ఈ సేవలు అందుతున్నాయని లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ సమాధానం ఇచ్చారు. దేశంలో ఏటా 70 లక్షల నుంచి 1 కోటి మంది పాలియేటివ్ కేర్ అవసరం ఉన్న రోగులు ఉన్నారని.. ఈ నేపథ్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్యాలియేటివ్ కేర్ (ఎన్పీపీసీ) ద్వారా అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలను దేశవ్యాప్తంగా ఉన్న 600కు పైగా జిల్లా ఆసుపత్రుల్లో అందజేస్తున్నట్లు తెలిపారు. అదనంగా ఆశా వర్కర్లు, కమ్యూనిటీ వాలంటీర్ల ద్వారా హోమ్‌బేస్డ్ పాలియేటివ్ సేవలు కూడా అందుతున్నాయని మంత్రి తెలిపారు. 2024-25 సంవత్సరంలో 60,82,069 మంది అవుట్‌పేషెంట్ సేవలు, 25,17,663 మంది ఇన్‌పేషెంట్ సేవలు పొందినట్లు ఆయన వెల్లడించారు. 5,50,056 మంది హోమ్‌బేస్డ్ సేవలు కూడా పొందారని తెలిపారు. కేర్ విస్తరణ కోసం ప్రభుత్వం శిక్షణపై కూడా దృష్టి పెట్టిందన్నారు. 2012లో ప్రారంభించిన ఎన్పీపీసీ ద్వారా వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణా నమూనాలను రూపొందించారు.
వీటిలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు), ఏఎన్ఎంలు, ఆశావ వర్కర్లు ఉన్నారని తెలిపారు. పాలియేటివ్ కేర్‌ను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల్లో అందించే 12 అత్యవసర సేవల్లో ఒకటిగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. టెలికన్సల్టేషన్ సేవలను కూడా ఉపయోగిస్తూ నిపుణుల సూచనలను గ్రామీణ ప్రాంతాలకు చేరుస్తున్నట్టు మంత్రి వివరించారు. ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్పీ-ఎన్సీడీ), హెచ్ఐవీ- ఎయిడ్స్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల స్థాయిలో సమగ్రంగా అందించే సేవగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.






