- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహస్యంగా ప్రభుత్వ జీవోలు.. అధికారులపై CM రేవంత్ సీరియస్
రహస్యంగా ప్రభుత్వ జీవోలు.. అధికారులపై CM రేవంత్ సీరియస్

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వానికి భిన్నంగా పారదర్శకత పాలన అందిస్తామని కాంగ్రెస్ అధికారంలో వచ్చిన మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి జీవో (కాన్ఫిడెన్షియల్ మినహాయించి)ను ఆన్‌లైన్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ, ఈ ఆదేశాలను కొన్ని శాఖలే పాటిస్తున్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ goir.telangana.gov.inలో ఆ జీవోలను అప్‌లోడ్ చేస్తున్నాయి. మరికొన్ని శాఖల అధికారులు కొన్ని జీవోలను మాత్రమే అప్‌లోడ్ చేసి.. మరికొన్నింటిని రహస్యంగా ఉంచుతున్నాయి. ఇంకొన్ని శాఖలైతే అసలు ఒక్క జీవోనూ అప్ లోడ్ చేయడం లేదు. 2023 డిసెంబరు 7 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,093 జీవోలు ఆన్‌లైన్‌లో కనిపిస్తుండగా.. అందులో సుమారు నాలుగోవంతు అనగా 1,121 జీవోలు కార్మికశాఖకు చెందినవే కావడం గమనార్హం. ఆ తరువాత ‘లా డిపార్ట్ మెంట్’ కు చెందిన 992 జీవోలు ఉండగా.. మున్సిపల్ శాఖకు చెందిన జీవోలు 887 ఉన్నాయి. హోం, హౌసింగ్ శాఖల ఆఫీసర్లు ఒక్క జీవోను సైతం ఇప్పటి వరకు అప్ లోడ్ చేయకపోవడం గమనార్హం.
‘రహస్యాలు’ ఎందుకు?
ప్రతి జీవోను ఆన్‌లైన్‌లో పెట్టాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా.. కొన్ని శాఖలు ఎందుకు పాటించడం లేదనే చర్చ జరుగుతున్నది. ఆయా శాఖలు ఎలాంటి జీవోలు ఇవ్వలేదా? ఇచ్చినా పబ్లిక్ డోమైన్‌లో పెట్టలేదా? లేకపోతే జీవోలను రహస్యంగా ఉంచాలని ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అనే డిస్కషన్ జరుగుతున్నది. కొందరు అధికారుల తీరు వల్లే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను హెచ్చరిస్తే తప్పా.. సర్కారులో పారదర్శకత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్టీఐ ద్వారా అప్లికేషన్లు పెట్టినా కొన్నిశాఖల అధికారులు జీవోలు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
హైకోర్టు తీర్పును పట్టించుకోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జారీ చేసిన జీవోలను చాలా శాఖలు ఆన్‌లైన్‌లో పెట్టేవి కావు. ఇందుకు నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమనే చర్చ జరిగింది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచుతున్నదని విపక్షాలు ఆందోళనలు చేశాయి. కొందరు హైకోర్టుకు వెళ్లగా.. జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టాలని తీర్పు వచ్చింది. కానీ.. కొన్ని జీవోలను మాత్రమే అప్‌లోడ్ చేసి.. మిగతా వాటిని రహస్యంగానే ఉంచేవారు.
ఆర్ అండ్ బీలో మంత్రి ఆదేశాలతో..
జారీ చేసిన ప్రతి జీవోను ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఆ శాఖలో ఏ రోజు జారీ చేసిన జీవో అదే రోజు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటుంది. మంత్రుల క్వార్టర్స్ రిపేర్లు, ఆఫీసర్ల ప్రమోషన్లు, అధికారుల చాంబర్ల రిపేర్లు.. ఇలా ప్రతి జీవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మిగతా మంత్రులు సైతం కోమటిరెడ్డి తరహాలో నిర్ణయం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






