ప్రభుత్వ సంకల్పానికి అధికారుల తూట్లు.. ఆ దరఖాస్తులు రిజెక్ట్

by Kema Shiva Kumar |

తెలంగాణను భూ సమస్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

ప్రభుత్వ సంకల్పానికి అధికారుల తూట్లు.. ఆ దరఖాస్తులు రిజెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను భూ సమస్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏండ్ల తరబడిగా పరిష్కారం కాని భూసమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ సంకల్పానికి కొందరు ఆఫీసర్లు తూట్లు పొడుస్తున్నారు. మార్గదర్శకాలు జారీ చేయాల్సిన ఉన్నతాధికారులు సర్క్యులర్‌ పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంలో పరిష్కార మార్గం తెలియని లక్షలాది అప్లికేషన్లను తిరస్కరించారు. నాలుగైదు సార్లు ధరణి పోర్టల్‌లో అప్లయ్ చేసుకున్నా రిజెక్ట్ చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షించారు. ఇప్పుడు సేమ్ ఫార్మూలాను అమలు చేస్తూ నిజమైన హక్కుదారులను ఇబ్బంది పెడుతున్నారు.

గైడ్‌లైన్స్ రాలేదంటూ బుకాయింపు

రైతుల న్యాయమైన భూసమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పూనుకుంది. దీనిపై అధికారులు సరైన శ్రద్ధ చూపకపోతే సర్కారుకు చెడ్డ పేరొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పేర్కొంటున్నారు. భూభారతి చట్టంలో అనేక మార్గాలున్నా ‘మాకు గైడ్ లైన్స్ రాలేదు’ అంటూ కొందరు తహశీల్దార్లు బుకాయిస్తున్నారు. పీవోబీ, భూస్వభావం, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, భూసేకరణ చేయకపోయినా తొలగింపు వంటి సమస్యలను సుమోటోగా పరిష్కరించాల్సి ఉంది. కానీ ఇప్పటికే మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తూ కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకున్నా.. గ్రామానికి వచ్చినప్పుడు మొర పెట్టుకున్నా.. తరతరాలుగా దున్నుకుంటున్న భూములపై హక్కులు రాకపోతే, మధ్యంతరంగా ప్రభుత్వ భూములని తేల్చేస్తే ప్రజలు ఆగ్రహానికి గురవుతారని రెవెన్యూ చట్టాల నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు కొందరు అధికారులు రెవెన్యూ సదస్సుల నిర్వహణను భారంగా ఫీల్ అవుతున్నారని సమాచారం. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకుంటే పరిష్కారానికి తమ దగ్గరికే వచ్చే వారు కదా అని బాధ పడుతున్నారని తెలిసింది.

గతంలోనే రిజెక్ట్ చేశాం..

మూడు రోజులుగా రెవెన్యూ సదస్సుల్లో కొన్ని అప్లికేషన్లు స్వీకరించడం లేదు. ఈ దరఖాస్తును గతంలోనూ ధరణిలో అప్లయ్ చేసుకుంటే రిజెక్ట్ చేశామంటూ రెవెన్యూ సిబ్బంది బదులిస్తున్నారు. కానీ అకారణంగా తిరస్కరించారని, బాధితుడిది న్యాయమైన కోరిక అని మాత్రం గుర్తించడం లేదు. ఉదాహరణకు పొషిషన్‌లో భూమి ఉంది. కొత్త పాస్‌బుక్‌లో విస్తీర్ణం సైతం ఉంది. కానీ భూభారతిలో తగ్గింది. అది సరి చేయాలని కోరితే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేశారు. ఈ ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎవరు అమ్మేసుకున్నా ఖాతాలో కొనసాగిస్తున్నారు? ఈ వివరాలు పాత ఆర్వోఆర్ రికార్డులను వెరిఫై చేస్తే తేలిపోతుంది. కానీ పరిశీలన చేయకుండానే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ అనే సాకును చూపించి నిజమైన హక్కుదారుడికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడీ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. డేటా కరెక్షన్‌లో వచ్చే అప్లికేషన్లలో 90‌‌ శాతం ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్‌లవే. మండల స్థాయిలో రికార్డులు పరిశీలించి ఎవరికి భూమి అధికంగా నమోదైందో(అమ్మేసినా డెలిట్ చేయలేదో) గుర్తించేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్లు సిద్ధంగా లేరు. కొన్ని మండలాల్లో గుర్తించినా రిపోర్టు రాసేటప్పుడు ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాన్ని సరి చేస్తూ వివరణ ఇవ్వడం లేదు. దాంతో కలెక్టర్ అప్రూవ్ చేసినా సీసీఎల్ఏ ఏకపక్షంగా రిజెక్ట్ చేస్తున్నారు. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ దాకా అప్రూవ్డ్ ఫైల్.. సీసీఎల్ఏ స్థాయిలో రిజెక్ట్ చేస్తే సదరు రైతుకు ఎంత ఆవేదన ఉంటుందో రెవెన్యూ అధికారులు గుర్తించడం లేదు. ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అప్రూవ్ చేసి పంపిస్తే సీసీఎల్ఏ రిజెక్ట్ చేశారు. మరోసారి అప్లయ్ చేసుకుంటే మళ్లీ కలెక్టర్ రిపోర్ట్ పంపారు. ఇప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి. ఈ సమస్యకు రిపోర్ట్ ఎలా రాయాలో నిర్దిష్టంగా సీసీఎల్ఏ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లే వరకు డేటా కరెక్షన్ దరఖాస్తులు పరిష్కారానికి నోచవని తేలిపోయింది.

పీవోబీ అధికారులకు వరం

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల పట్టా భూములను ప్రభుత్వానిగా మార్చేశారు. అది పట్టా భూమిగా హక్కుదారుడే నిరూపించుకోవాలంటూ పేచీ పెడుతున్నారు. 1955 నుంచి పట్టాగా ఉన్న భూమి, పలుమార్లు చేతులు మారిన భూమి.. ఐనా సేత్వార్, ఖాస్రా పహానీ ప్రకారం అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేసి చోద్యం చూస్తున్నారు. అంటే 70 ఏండ్లుగా పట్టా భూమి సడెన్‌గా ప్రభుత్వ భూమిగా ఎలా మారుతుంది? ఉదాహరణకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యరడవల్లిలో పట్టా భూములను ఖారీజ్ ఖాతా పేరిట పీవోబీలో పెట్టారు. హక్కుదారులు మూడు సార్లు అప్లయ్ చేస్తే రిజెక్ట్ చేశారు. ఇప్పుడేమో రెవెన్యూ సదస్సులో ‘గతంలో రిజెక్ట్ చేశాం.. ఇప్పుడు తీసుకోం’ అంటున్నారు. అది ఖారీజ్ భూమి ఐతే.. అప్పటి నుంచి పట్టాగా రాస్తూ వచ్చిన పట్వారీలు, వీఆర్వోలు, గిర్దావర్లు, తహశీల్దార్లు, పాసు బుక్స్ జారీ చేసిన ఆర్డీవోలపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? అలాగే లెక్క లేనన్నిసార్లు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లను, మ్యుటేషన్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి? అలా తహశీల్దార్ ప్రభుత్వానికి రిపోర్ట్ రాయాలి. కానీ ఖాస్రా పహానీ ముసుగులో 50, 60, 70 ఏండ్లుగా రికార్డుల్లో కొనసాగుతున్న పట్టా భూమి ఇక ప్రభుత్వానిదే అనడం దేనికి సంకేతం? ఇక్కడ ఎవరి హక్కులను ఎవరు కాలరాస్తున్నారు? రైతులను నట్టేట ముంచుతారా? అప్పటి నుంచి తప్పులు చేస్తూ వేతనాలు తీసుకున్న రెవెన్యూ సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటారా? ఈ విషయంపై ప్రభుత్వం లెక్క తేల్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ సమస్యకు ఈజీగా పరిష్కారం చూపిన కలెక్టర్లు ఉన్నారు. 30 ఏండ్లకు పైగా పట్టాగా ఉంటే దాన్ని పట్టాగానే భావించాలని స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం సేత్వార్ ప్రామాణికం అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ధరణి పోర్టల్‌లో డేటాను ఆర్వోఆర్ చట్టం 1971 సెక్షన్ 4(3) ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్‌ను ప్రిపేర్ చేశారు. దాని ప్రకారమే రికార్డుల నిర్వహణ, తయారీ జరుగుతుందన్నారు. కానీ సేత్వార్, ఖాస్రా పహానీల ప్రకారం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇలాంటి సమస్యకు సీసీఎల్ఏ దరఖాస్తుల తిరస్కరణకు బదులుగా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

భూ సేకరణ పేరిట దగా

కొన్ని జిల్లాల్లో భూమిని సేకరించకపోయినా ప్రభుత్వ భూసేకరణ అంటూ నోటిఫికేషన్ పేరిట భూములను నిషేధిత జాబితాలో నమోదు చేశారు. ఇంకొన్ని చోట్ల సేకరించిన భూమి కంటే అధికంగా నిషేధిత జాబితాలో నమోదు చేసిన ఉదంతాలున్నాయి. ఉదాహరణకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లిలో పట్టాదారుడి ఖాతా నుంచి ఒక సర్వే నంబర్‌లో మూడెకరాలు ఉంటే.. 1.20 ఎకరాలే భూమిని సేకరించి నష్టపరిహారం చెల్లించారు. కానీ ఆ సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని డెలిట్ చేశారు. రికార్డు సరి చేయాలని దరఖాస్తు చేసుకుంటే మూడు సార్లు రిజెక్ట్ చేశారు. ఇదేం తీరో ఆ జిల్లా కలెక్టర్ బాధితులకు చెప్పాలి. నాల్గోసారి అప్లయ్ చేస్తే మూడు సార్లు రిపోర్ట్ కాపీని మార్చారు. అయినా కలెక్టర్ మాత్రం పరిశీలించకుండా మూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఈ సమస్యకు కేవలం భూసేకరణ నోటిఫికేషన్, అవార్డు కాపీ పరిశీలిస్తే సరిపోతుంది. ఈ చిన్న పని చేయకుండా మూడేండ్లుగా అధికారులు తిప్పించుకుంటుంటే బాధిత రైతు ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. ఇలాంటి భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల దాకా రాకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

సదస్సుల ఆశయాలు ఘనం

* రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మెమో నం.14688/Land Admin.1(1)/2025 ప్రకారం ఆదేశాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఏ సమస్యను, ఎలా పరిష్కరించాలి? అనే ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవ్వలేదు.

* ప్రతి మండలంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లతో రెండు టీముల ఏర్పాటు.

* జిల్లా కలెక్టర్ ప్రతి రోజూ మానిటరింగ్ చేయాలి. ప్రతి రోజూ స్వీకరించిన అప్లికేషన్ల సంఖ్యను తెలుసుకోవాలి.

* ప్రతి అప్లికేషన్‌కు రశీదు ఇవ్వాలి. దాంట్లో జిల్లా, మండలం, విలేజ్ కోడ్.. ఆ తర్వాత నాలుగు అంకెల నంబర్ ఉండాలి. ప్రతి అప్లికేషన్ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

* రెవెన్యూ సదస్సుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.

* ఆగస్టు 14వ తేదీలోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి.

సదస్సుల్లో పరిష్కరించాల్సినవి

* ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం హెచ్చుతగ్గులు

* పీవోబీ, పీవోటీ కేసులు

* భూ సేకరణ కేసులు

* సరిహద్దు వివాదాలు

* సాదాబైనామా కేసులు

* అసైన్‌మెంట్ కమిటీ సంబంధ అంశాలు

* పార్టు-బి కేసులు

రెవెన్యూ సదస్సులో పరిష్కరించాలని పేర్కొన్న ఈ సమస్యలకు ఎలాంటి మార్గదర్శకాలనూ ప్రత్యేకంగా జారీ చేయలేదు. దీని ఆధారంగా అన్నింటినీ పెండింగులో ఉంచుతున్నారు. ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ మొదలుకొని సాదాబైనామా కేసుల వరకు ఏ దరఖాస్తునూ పరిష్కరించిన దాఖలాలు లేవు.

Next Story