సంక్రాంతి వేళ రెచ్చిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు.. అవి ఏమూలకు సరిపోకపోవడమే కారణమా?

by Gantepaka Srikanth |

రవాణాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కొన్ని రోజులుగా రవాణాశాఖ అధికారులు రోడ్లపై తనిఖీలు కొనసాగిస్తున్నారు.

సంక్రాంతి వేళ రెచ్చిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు.. అవి ఏమూలకు సరిపోకపోవడమే కారణమా?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: రవాణాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కొన్ని రోజులుగా రవాణాశాఖ అధికారులు రోడ్లపై తనిఖీలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణలోని ఇతర జిల్లాలకు, ఏపీకి తరలివెళ్తుంటారు. రద్ధీ అధికంగా ఉండడంతో ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడిపింది. అవి ఏమూలకు సరిపోకపోవడంతో గ్రామాలకు వెళ్లేవారు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. దీంతో రెట్టింపు రేట్లు వసూలు చేసి వీలైనంత వరకు ప్రయాణికులను దోపిడీకి తెరలేపారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా మూలకు పడిఉన్న బస్సులను సైతం రోడ్లపైకి తెచ్చి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫిట్‌నెస్, రోడ్డు పర్మిట్‌లు లేకుండా బయటకు రావడంపై అధికంగా ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు ముందు నుంచి రోడ్లపై తనిఖీలు చేపట్టి అనుమతులు లేని బస్సులను సీజ్ చేశారు. ఈ దాడులు సోమవారం వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

నిబంధనలకు నీళ్లు...

నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా రోడ్లపై తిరగడం నిషేదమైనప్పటికీ ఇష్టారాజ్యంగా తిప్పుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. ప్రయాణికులను రవాణా చేయడానికి అవసరమైన లైసెన్స్, ట్రాన్స్‌పోర్టర్‌గా లైసెన్స్, ఆర్టీఏ అనుమతులు, బస్సులను ఒక రాష్ట్రంలో లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో తిప్పడానికి అనుమతులు అవసరం. వీటిని నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేమి లేకుండానే విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ నడుపుతూ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది.

317 బస్సులపై కేసులు నమోదు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 317 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి శనివారం వరకు నగరంలోని వివిధ జోన్లలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈస్ట్ జోన్ 50 కేసులు, వెస్ట్ జోన్ 30, సౌత్ జోన్ 72, సెంట్రల్ జోన్ 43, నార్త్‌జోన్ 48, నాగోల్ ఆర్టీఏ పరిధిలో అత్యధికంగా 74 బస్సులపై మొత్తంగా 317 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

Next Story