- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగ్స్ టెండర్లకు అడ్డంకులు..! చక్రం తిప్పుతున్న సౌత్ తెలంగాణ లీడర్లు
అంగన్‌వాడీ, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లు ఫైనల్ కాకుండా దక్షిణ తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్‌వాడీ, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లు ఫైనల్ కాకుండా దక్షిణ తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టెండర్లు తమకే దక్కేలా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రక్రియ చివరి దశకు వచ్చే సమయంలో కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు. పెద్దస్థాయిలో స్థాయిలో లాబీయింగ్ చేస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మరో పక్షం రోజుల్లో ఫైనల్ కావాల్సిన టెండర్ల ప్రక్రియ.. మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు టెండర్లు వాయిదా పడగా.. మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశమున్నది.
ఫిబ్రవరిలోనే గడువు ముగిసినా..
అంగన్ వాడీ లకు కోడి గుడ్ల సరఫరా టెండర్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా ఎన్నికల కోడ్ ఉండడంతో టెండర్లకు ఓ నెలపాటు బ్రేక్ పడింది. ఆ సమయంలో పాత కాంట్రాక్టర్లతోనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నెట్టుకొచ్చారు. మార్చిలో కొత్త టెండర్లు పిలిచినా.. కొందరు పౌల్ర్టీ యజమానులు కోర్టుకు వెళ్లారు. అగ్ మార్క్, రిప్లికా, అనుభవం, టర్నోవర్ వంటి షరతులను వ్యతిరేకించారు. అయితే కోర్టు వాటి పిటిషన్ ను తిరస్కరించి, టెండర్ల షరతులను సమర్థించింది. అయినప్పటికీ రాజకీయ కారణాలతో టెండర్లను ఫైనల్ చేయలేదనే చర్చ జరుగుతున్నది.
జిల్లాల వారీగా టెండర్లకు నిర్ణయం..
ఆ సమయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చింది. అంగన్ వాడీ కేంద్రాలతోపాటు అన్ని గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లకు కలిపి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో అంగన్వాడీ కేంద్రాల కోసం ఏటా సుమారు 36 కోట్ల కోడి గుడ్ల సరఫరాకు టెండర్లు పిలవగా.. ప్రభుత్వ హాస్టళ్లతో కలిసి ఏడాదికి 80 కోట్లకుపైగా గుడ్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అంతేకాకుండా గతంలో రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచేవారు. కానీ, ఈ సారి 33 జిల్లాల వారీగా పిలవడమే కాకుండా.. కాంట్రాక్ట్ గడువును రెండేళ్ల నుంచి ఒక సంవత్సరానికి ప్రభుత్వం కుదించారు. టెండర్ల ఖరారు బాధ్యతలను కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీలకు అప్పజెప్పింది. నాణ్యత పాటించేలా, సరఫరా సజావుగా జరిగేలా టెండర్ల షరతులపై సీఎస్ జీవో జారీ చేశారు. టెండర్లలో పాల్గొనే వారు తెలంగాణ పౌల్ట్రీ రైతు అయి ఉండాలని, రూ. ఐదు కోట్ల టర్నోవర్ ఉండాలని అందులో పేర్కొన్నారు. గతంలో అంగన్ వాడీలు, లేక ప్రభుత్వ హాస్టళ్లకు కోడి గుడ్లు సరఫరా చేసిన అనుభం ఉండాలని, గత మూడేళ్ల కాలంలో ఏదైనా ఒక ఏడాదిలో రూ.5 కోట్ల విలువైన గుడ్లను సరఫరా చేసి ఉండాలనే నిబంధనలను పెట్టారు.
ప్రక్రియ చివరి దశలో అడ్డంకులు
టెండర్ల ప్రక్రియను జులై మొదటి వారంలో ప్రారంభించి.. ఆగస్టు ఫస్ట్ వీక్ లో పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు జారీ చేసిన జీవోలో స్పష్టం చేశారు. దీంతో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి నోడల్ అధికారిగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాల కలెక్టర్లు టెండర్లను ఆహ్వానిస్తూ పత్రికల్లో బహిరంగ ప్రకటనలు జారీ చేశారు. చాలా మంది కాంట్రాక్టర్లు ఇప్పటికే జిల్లాల వారీగా టెండర్లు దాఖలు చేశారు. మరో పక్షం రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. అయితే ఈ టెండర్లను అడ్డుకునేందుకు దక్షిణ తెలంగాణకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అనుభవం, టర్నోవర్ వంటి నిబంధలను ఎత్తేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే వారు కోరినట్లు నిబంధనలను సడలిస్తే.. కథ మళ్లీ మొదటికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అనుభవం, టర్నోవర్లనేవి ప్రతి టెండర్ లో కనీస నియమాలని, అవి లేకుండా టెండర్లు పిలిస్తే కోర్టుల్లో చిక్కులు తప్పవని పేర్కొంటున్నారు. కనీస నిబంధనలు లేకుంటే.. అనర్హులు టెండర్లు దక్కించుకొని ఆ తర్వాత చేతులెత్తేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటికే పలు దఫాలుగా టెండర్ల నిబంధనలు మార్చడంతోపాటు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ నిబంధనలు మారిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పుడు మరింత ఆలస్యం చేయకుండా టెండర్లను ఫైనలైజ్ చేయాలని, లేకుంటే కోడిగుడ్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని పేర్కొంటున్నారు.






