- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ.. కొత్తగా 2,769 ప్రీ-ప్రైమరీ విభాగాలు
తెలంగాణలోని 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతుల కోసం ప్రతి స్కూలుకు రూ. లక్ష కేటాయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రీ ప్రైమరీ కోసం ప్రైవేటు స్కూళ్లలో చేరకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా ప్రీ-ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తరగతులను విస్తరిస్తున్న ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాలు ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురానున్నారు.
జోన్ల వారీగా విభాగాల కేటాయింపు..
ప్రభుత్వం కొత్తగా అనుమతించిన 2,769 విభాగాలను రెండు ప్రధాన రీజియన్లుగా వర్గీకరించింది. క్యూర్ రీజియన్ పరిధిలో 529 విభాగాలు, నాన్ క్యూర్ రీజియన్ పరిధిలో 2,240 విభాగాలు ఉన్నాయి. ప్రీ-ప్రైమరీ విభాగాలను తక్షణమే ప్రారంభించేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ విభాగాల నిర్వహణ కోసం వేతన ప్రాతిపదికన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లను, ఆయాలను నియమించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
పాఠశాలకు రూ. లక్ష..
ప్రీ-ప్రైమరీ తరగతులకు వచ్చే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు రూ. లక్ష చొప్పున మౌలిక వసతుల కల్పన కోసం ఇవ్వనుంది. ఈ నిధులతో తరగతి గదుల ఆధునీకరణ, పిల్లలకు సరిపోయే బెంచీలు, బ్లాక్ బోర్డులు, ఆట వస్తువులు, వాల్ పెయింటింగ్స్, ఇతర విద్యా సామగ్రిని సమకూర్చనున్నారు.
ప్రభుత్వం పాఠశాలల బలోపేతం దిశగా..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. గతంలోనే ప్రయోగాత్మకంగా 1,000 ప్రీ-ప్రైమరీ తరగతులను విజయవంతంగా ప్రారంభించిన విద్యాశాఖ.. లభించిన ఆదరణ, ఫలితాల ఆధారంగా ఈ ఏడాది మరిన్ని పాఠశాలలకు దీన్ని విస్తరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తప్పడమే కాకుండా, చిన్న వయసు నుంచే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్‌కు 74, హన్మకొండకు 39, కరీంనగర్‌కు 58, వరంగల్‌కు 48 చొప్పున రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లోని పాఠశాలలకు ఈ అనుమతులు లభించాయి.






