ఎన్ఆర్ఐ వివాహాల్లో చీకటి నిజాలు.. ఆందోళనకరంగా కాపురాలు

by Naga Rani Yarlagadda |

ఎన్ఆర్ఐ వివాహాల్లో విభేదాలు, మోసాలు, వేధింపులు పెరుగుతున్నాయి. తెలంగాణ సీఐడీ పరిధిలోని ఎన్ఆర్ఐ సెల్ గణాంకాలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్పష్టమవుతోంది.

ఎన్ఆర్ఐ వివాహాల్లో చీకటి నిజాలు.. ఆందోళనకరంగా కాపురాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్ఆర్ఐ వివాహాల్లో విభేదాలు, మోసాలు, వేధింపులు పెరుగుతున్నాయి. తెలంగాణ సీఐడీ పరిధిలోని ఎన్ఆర్ఐ సెల్ గణాంకాలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్పష్టమవుతోంది. ఒకప్పుడు ఎంతో గౌరవాన్ని పొందిన ఎన్ఆర్ఐ సంబంధాలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 2025లో ఇప్పటివరకు మొత్తం 72 కేసులు నమోదు కాగా, సగటున నెలకు 6 కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ సెల్‌ను సంప్రదిస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గృహహింస, భరణం, విడాకులు, పిల్లల కస్టడీ వంటి అంశాల్లో బాధిత మహిళలకు న్యాయసలహాలు, మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ నిందితులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ఆర్ఐ భర్తల చేతిలో మోసపోయినట్లు, విదేశాలకు తీసుకెళ్లి విడిచిపెట్టినట్లు, గృహహింసకు గురైనట్లు మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారు. పెళ్లి పేరుతో విదేశాల్లో స్థిరపడతామని నమ్మబలికి, అనంతరం బాధితులను వదిలేసే ఘటనలు పెరుగుతున్నాయని ఇటు అధికారులు సైతం చెబుతున్నారు.

16 మందిని రప్పించిన ఎన్ఆర్ఐ సెల్..

ప్రవాస భారతీయులపై వేధింపులు, మోసాలు ఇతర నేరాలకు సంబంధించి సీఐడీ పరిధిలోని ఎన్ఆర్ఐ సెల్ మొత్తం 72 కేసులను నమోదు చేసింది. కేసుల్లో నిందితులుగా ఉన్నవారు విదేశాలకు పారిపోకుండా లేదా విదేశాల నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు 33 మందిపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. వివిధ దేశాల్లో తలదాచుకున్న 16మంది ఎన్ఆర్ఐ నిందితులను ఎన్ఆర్ఐ సెల్ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకుని తిరిగి రాష్ట్రానికి రప్పించారు. ఎన్ఆర్ఐ వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పెళ్లికి ముందు పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్ఆర్ఐ సమస్యలపై సహాయం కోసం బాధితులు +91 87126 56858 నంబర్‌కు ఫోన్ లేదా.. [email protected]కు ఈ-మెయిల్‌కు ఫిర్యాదు చేయవచ్చంటున్నారు.

కల్చరల్ క్లాష్..

ప్రవాస భారతీయుల వైవాహిక జీవితాల్లో పెరుగుతున్న కలహాలు విడాకులకు అనేక సామాజిక, మానసిక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా భారతదేశంలో పెరిగిన విలువలకి, విదేశాల్లో ఉండే జీవనశైలికి మధ్య పొంతన లేకపోవడం కలహాలకు దారి తీస్తుందని ఎన్ఆర్ఐ సెల్ చెప్తోంది. వివాహనికి ముందు అబ్బాయి ఉద్యోగం, జీతం ప్రవర్తన గురించి పూర్తిగా విచారించకుండా కేవలం పెళ్లిళ్లు చేయడం వల్ల తర్వాత సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో విదేశాల్లో చట్టాల పట్ల అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని భర్త లేదా అత్తామామలు మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. తిరుగు ప్రయాణం చేయడానికి వీలులేకుండా పాస్‌పోర్ట్‌లు లాక్కున్న ఘటనలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగోల్‌కు చెందిన ఓ వివాహిత సరూర్‌నగర్ ఉమెన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ ఉద్యోగం చేసే తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని పేర్కొన్నది. పాప పుట్టిన తరువాత బాడీ షేమింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. ఇటీవలే తనను, తన బిడ్డను వదిలేసి విదేశాలకు వెళ్లినట్లు ఎన్ఆర్ఐ సెల్‌లో ఫిర్యాదు చేసింది.

Next Story