రూ.10వేల కంటే ఎక్కువ ఉండొద్దు.. అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల సూచనలు

by Ajay Maddhiboyina |

పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. ఇప్పటికే క్యాండిడెట్స్‌కు గుర్తులు కూడా కేటాయించారు.

రూ.10వేల కంటే ఎక్కువ ఉండొద్దు.. అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. ఇప్పటికే క్యాండిడెట్స్‌కు గుర్తులు కూడా కేటాయించారు. దీంతో అభ్యర్థులు తమ గుర్తులతో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయపరిశీలకులు అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టారు. వారికి మార్గదర్శకాలు జారీ చేశారు. అభ్యర్థులు నామినేషన్​వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ఖర్చులను వివరాలను అభ్యర్థి, లేదా తన ఏజెంట్​ద్వారా కానీ ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రచారం కోసం ఉపయోగించే వాహనాలు, మైక్‌లు, సభలు, ర్యాలీలు, రిటర్నింగ్​అధికారి, పోలీసులు, సంబంధిత అధికారుల వద్ద ముందుస్తు అనుమతి తీసుకోవాలి. ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫార్మాట్‌లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు ఓచర్​తప్పనిసరిగా జత చేయాలి.

దానిపై అభ్యర్థి లేదా ఏజెంట్​ తప్పనిసరిగా పెయిడ్​బై మీ రాసి సంతకం చేయాలి. నామినేషన్​టైంలో అధికారులకు సమర్పించిన బ్యాంక్ ​అకౌంట్ నుంచి మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌లో ఎన్నికల ఖర్చుల కోసం ఉద్దేశించిన మొత్తాన్ని అభ్యర్థి డిపాజిట్​చేయాల్సి ఉంటుంది. రూ.10వేలకు మించిన చెల్లింపులను క్రాస్‌డ్​అకౌంట్​పే చెక్ రూపంలో ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. రూ.10వేల లోపు ఖర్చులను డ్రా చేసి నగదు వినియోగించవచ్చు. ఎన్నికల పూర్తిగా ముగిసే వరకు ఎన్నికల కోసం తీసిన బ్యాంకు అకౌంట్‌ను మరే ఇతర అవసరాలకు వాడకూడదు. ఖర్చుల ధరలు జిల్లా ఎన్నికల అథారిటీ నిర్ధారించిన రేటు ఛార్ట్​ప్రకారమే లెక్కలను అనుమతిస్తారు. ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్​వద్ద రూ.10వేల కంటే ఎక్కువ నగదు ఉండోద్దని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతీ రోజు ఎంపీడీవో‌కి..

రోజు వారి ఖర్చు వివరాలను ప్రతీ రోజు ఎంపీడీవో‌కి అభ్యర్థి లేదా ఏజెంట్ ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రొఫార్మాలో ఇవ్వాలి. వ్యక్తిగతంగా, మెసేంజర్​ద్వారా అందించవచ్చు. ఎన్నికల పరిశీలకులు సూచించిన తేదీల్లో అభ్యర్థులు, ఏజెంట్​తమ పూర్తి అకౌంట్‌ను పరిశీలనకు అందించాల్సి ఉంటుంది. పరిశీలనకు అకౌంట్​వివరాలు అందించకుంటే అభ్యర్థులకు నోటిసులు జారీ చేస్తారు. నోటిసులు అందిన తర్వాత కూడా రికార్డులు సమర్పించనిచో ఐపీసీ 171–1 కింద చర్యలు తీసుకుంటూ ప్రచార వాహనాల అనుమతులు రద్దు చేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన 45 రోజుల్లో అభ్యర్థులు, ఏజెంట్లు ఫలితాలు పూర్తి అకౌంట్‌ను ఎంపీడీవోకు సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తారు. అభ్యర్థులు నిర్వహించే ఎన్నికల అకౌంట్‌తోపాటు ప్రతీ మండలంలో సహాయ వ్యయ పరిశీలకుల ఆధ్వర్యంలో వివిధ వ్యయ పరిశీలన మానటిరింగ్​టీంల ద్వారా సేకరించిన ఎన్నికల వ్యయ సమాచారంతో ప్రతీ ఒక్క అభ్యర్థి పేరు మీద షాడో అబ్సర్‌వేషన్​రిజిస్టర్​ నిర్వహిస్తారు. పరిశీలన, ఫైనల్​అకౌంట్ సందర్భంలో ఈ రిజిస్ట్రర్‌తో అభ్యర్థి సమర్పించిన అకౌంట్​సరిపోల్చి చూస్తారు. ఒక వేళ అభ్యర్థి సమర్పించిన వ్యయం కంటే షాడో రిజిస్టర్​సంబంధిత వ్యక్తి యొక్క వ్యయం ఎక్కువగా ఉన్నట్లుగా అయితే అభ్యర్థి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటారు.

ఎన్నికల ఖర్చులు ఈ విధంగా...

– 5వేల పైబడిన జనాభా కలిగిన గ్రామాలకు సర్పంచ్​అభ్యర్థి ఖర్చు రూ.2.50 లక్షలు

– 5వేల పైబడిన గ్రామాల్లో వార్డు సభ్యులు గరిష్ఠ ఖర్చు రూ. 50 వేలు

– 5వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు సర్పంచ్​అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షలు

– 5వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యుల ఖర్చు రూ.30 వేలు

Next Story