- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాదికి పెద్దపీట.. దిక్కులేని దక్షిణాది?
దేశంలో రహదారుల అభివృద్ధి జోరుగా సాగుతున్నా.. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులుగా మారిన జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యంగా రవాణా రద్దీని తగ్గించడం, వేగవంతమైన ప్రయాణం కోసం ఎక్స్‌ప్రెస్ వేలు, రింగ్ రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. అయితే, ఈ అభివృద్ధి ఫలాల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. భారీ ప్రాజెక్టుల నుంచి నిధుల కేటాయింపుల వరకు ఉత్తరాది రాష్ట్రాలకే సింహభాగం దక్కుతుండగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు అంతంతే ఉంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకే సింహభాగం నిధులు కేటాయించారని నివేదిక వెల్లడిస్తోంది.
దక్షిణాదిపై చిన్నచూపు.. ఉత్తరాదిపైనే ప్రేమ..
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి అందుతున్న ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్(1,383 కి.మీ), రాజస్థాన్ (1,458 కి.మీ) వంటి రాష్ట్రాల్లో భారీ కారిడార్లు వస్తుండగా, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ (2,452 కి.మీ) మినహా మిగిలిన రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు ఒక్క ఏడాదిలోనే (2023-24) రూ.28,114 కోట్లు కేటాయించగా, తెలంగాణకు అదే ఏడాది కేటాయించింది కేవలం రూ.6,117 కోట్లు మాత్రమే. 5 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు ఎంపికైన నగరాల సంఖ్య కూడా ఉత్తరప్రదేశ్ (13), మహారాష్ట్ర (12) రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఆ సంఖ్య కేవలం రెండుకు పరిమితమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో హై స్పీడ్ కారిడార్ల పొడవు పరంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణే రెండో స్థానంలో ఉంది. అయితే, నిధుల వినియోగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా 2024-25లో కేటాయింపుల (రూ.7,496 కోట్లు) కంటే ఎక్కువ వ్యయం (రూ.7,564 కోట్లు) చేసి ప్రాజెక్టుల అమలులో వేగాన్ని ప్రదర్శించింది. యూపీ, మహారాష్ట్ర, ఏపీ, బిహార్, గుజరాత్, ఎంపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టే ఆ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ వాటా 1,124 కి.మీ.
తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరిస్తున్నప్పటికీ ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే అది నామమాత్రంగానే ఉంది. తెలంగాణలో 1,124 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ కారిడార్లు లేదా ఎక్స్‌ప్రెస్ వేలను ప్రభుత్వం ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. రాష్ట్రంలో 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న రెండు నగరాలను రింగ్ రోడ్లు లేదా బైపాస్‌ల అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. 2022-23లో తెలంగాణకు రూ. 3,622 కోట్లు కేటాయించగా, 2024-25 నాటికి అది రూ. 7,496 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26 జనవరి 31 వరకు) ఇప్పటికే రూ. 5,644 కోట్లు ఖర్చు చేశారు. ఇది కేటాయించిన రూ. 4,921 కోట్ల కంటే అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణకు నిధుల కేటాయింపు తక్కువే.
జాతీయ స్థాయిలో రహదారుల ప్రగతి..
దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం సుమారు 19,000 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ కంట్రోల్డ్ హై స్పీడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించింది. ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 83 నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రింగ్ రోడ్లు, బైపాస్‌లను నిర్మిస్తోంది. గడిచిన మూడేళ్లలో నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ (రూ.28,114 కోట్లు), మహారాష్ట్ర (రూ.19,867 కోట్లు) వంటి పెద్ద రాష్ట్రాలు గరిష్ఠ నిధులను దక్కించుకున్నాయి.
ప్రాజెక్టుల జాప్యానికి కారణాలు
రహదారి ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి ప్రధానంగా భూసేకరణ, రైల్వే క్లియరెన్సులు, డిజైన్ సమస్యలు, కాంట్రాక్టర్ల ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4 ప్రాజెక్టులు ఐదేళ్లకు పైగా జాప్యం అవుతుండటం గమనార్హం.






