అధికార పార్టీలో ‘నామినేటెడ్’ సెగ.. ఆశావహుల్లో పెరుగుతున్న నైరాశ్యం!

by Kema Shiva Kumar |

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన నెలకొంది. ఏఐసీసీ ఆదేశాలను సైతం పక్కన పెట్టి, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆశావహుల్లో అసహనం పెరుగుతోంది.

అధికార పార్టీలో ‘నామినేటెడ్’ సెగ.. ఆశావహుల్లో పెరుగుతున్న నైరాశ్యం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్నట్టుగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నరేండ్లు గడుస్తున్నా.. పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడం కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. ఏఐసీసీ నేతల ప్రకటనలతో పదవులు ఆశించిన నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తుండగా.. ఆ తర్వాత అప్పుడూ, ఇప్పుడూ అని కాలయాపన చేస్తుండడంతో అసహనం పెరిగిపోతున్నది. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుంటే ఎవరికి ప్రయోజనమో అర్థం కావడం లేదని, ఎవరికో ఒకరికి ఇస్తే వాళ్లైనా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతున్నది.

అనేక పదవులు ఖాళీ..

రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్, మహిళా కమిషన్, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సహా ఇంకా అనేక కీలక పదవులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో కొన్ని కుల సంఘాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనంగా మరికొన్ని ఫెడరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఇంకా భర్తీ చేయలేదు. గత రెండేళ్లుగా ఏదో ఒక కారణంతో వీటి భర్తీ వాయిదా పడుతూ వస్తున్నది. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించి, డెడ్ లైన్లు విధించినా.. ఇంత వరకు పోస్టులు భర్తీ కాలేదు.

కుదరని ఏకాభిప్రాయం

నామినెటెడ్ పోస్టుల కోసం నాయకుల పేర్లను పీసీసీ ఇప్పటికే సేకరించింది. వారిలో ముఖ్యమైన పేర్లను వడపోసి మరో జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇక్కడే తిరకాసు మొదలైంది. ఒకరు సిఫార్సు చేసిన పేరును మరొకరు వ్యతిరేకిస్తున్నారు. తాము సూచించిన వారికి, తమ నియోజకవర్గానికి, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం వారు ఎంతగానో పని చేశారని చెబుతున్నారు. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఒకరికి పదవి ఇస్తే నలుగురు వ్యతిరేకించడమో, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడమో జరుగుతుందని, దీని కంటే పెండింగ్ లో పెట్టడమే బెటర్ కదా అని కొందరు కీలక నేతలు ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో నామినేటెడ్ పదవులు ఎవరికీ రాకుండా పోతున్నట్లు తెలుస్తున్నది.

ఆశావహుల్లో నైరాశ్యం

నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆశావహులతోపాటు కార్యకర్తల్లో సైతం ఆగ్రహం పెరిగిపోతున్నదని పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఎన్నాళ్లు పెండింగ్ లో పెడతారని మంత్రులు, ఎమ్మెల్యేలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అందరూ కూర్చొని ఏకాభిప్రాయానికి రావాలని, ఎవరికో ఒకరికి పదవులు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు.

Next Story