- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి, రైతులకు పగటిపూట నమ్మకమైన ఉచిత విద్యుత్ అందించడంతోపాటు డిస్కంలను సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన పీఎం-కుసుమ్ పథకంలో రాష్ట్రానికి ఘోర అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులను కొల్లగొడుతుంటే, తెలంగాణకు మాత్రం కేంద్రం నిలువునా మొండిచేయి చూపింది. జనవరి 31, 2026 నాటికి ఈ పథకం కింద తెలంగాణకు విడుదల చేసిన నిధులు అక్షరాలా సున్నా అని తేలిపోయింది. లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం.. రాష్ట్ర ప్రభుత్వాల నిమ్మకు నీరెత్తిన వైఖరిని, కేంద్రం చూపుతున్న వివక్షను నగ్నంగా బయటపెట్టింది. ఫలితంగా రాష్ట్రం ఆశించిన 26 లక్షల పంపుల సౌరశక్తీకరణకు అవకాశమే లేకుండా పోయింది.
పక్క రాష్ట్రాలకు కాసుల పంట..
దేశవ్యాప్తంగా పీఎం-కుసుమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 8,242.86 కోట్లు విడుదల చేసింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రకే సగాని కంటే ఎక్కువగా రూ. 4,515.89 కోట్లు కేటాయించారు. హర్యానాకు రూ. 1,307.48 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 991.30 కోట్లు దక్కాయి. చిన్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సైతం కోట్ల రూపాయల నిధులు సాధించుకున్నాయి. కానీ, 29 లక్షలకు పైగా వ్యవసాయ పంప్‌సెట్లు ఉండి, దేశానికే అన్నపూర్ణగా మారిన తెలంగాణకు మాత్రం కేంద్ర నిధుల పట్టికలో గుండుసున్నా మిగిలింది.
మంజూరైనా.. మట్టిపాలే!
రాష్ట్ర పాలకుల ప్రగల్భాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత తేడా ఉందో కేంద్రం ఇచ్చిన అధికారిక గణాంకాలే సాక్ష్యం. తెలంగాణకు వివిధ విభాగాల కింద వేల సంఖ్యలో సౌర పంప్‌సెట్లు మంజూరైనప్పటికీ, వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. సాగుకు పనికిరాని భూముల్లో గ్రిడ్‌కు అనుసంధానించే చిన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉద్దేశించిన కాంపొనెంట్-ఏ కింద 1797.00 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మంజూరైతే... క్షేత్రస్థాయి ప్రగతి సున్నా. విద్యుత్ లైన్లు లేని ప్రాంతాల్లో రైతుల కోసం విడిగా పనిచేసే ఆఫ్-గ్రిడ్ సోలార్ పంపుల పంపిణీకి ఉద్దేశించిన కాంపొనెంట్-బీ కింద రైతులకు అందజేయాల్సిన 20,000 సోలార్ పంపుల్లో ఒక్కటీ అమర్చలేదు. ప్రస్తుతం గ్రిడ్‌కు కనెక్ట్ అయి ఉన్న పాత వ్యవసాయ పంప్‌సెట్లను పూర్తిస్థాయి సౌరశక్తి పంపులుగా (సోలరైజేషన్) మార్చేందుకు తీసుకువచ్చిన కాంపొనెంట్-సీ గ్రిడ్ అనుసంధాన పంపుల కింద మంజూరైన 28,000 పంపుల్లో నేటికీ ఒక్క దానికి కూడా మోక్షం లభించలేదు. అంటే మూడు కాంపోనెంట్లలోనూ మన రాష్ట్ర ప్రగతి సున్నా.
లేఖల ప్రసహసనం.. చేతలు శూన్యం!
రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను కేవలం ఢిల్లీకి లేఖలు రాయడానికే పరిమితం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 మార్చి నుంచి 2025 మే వరకు ఫీడర్ లెవెల్ పోలరైజేషన్ కోసం లక్షలాది పంపులు కావాలని రాష్ట్ర అధికారులు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. రాబోయే నాలుగేళ్లలో 26 లక్షల పంపులను సౌరశక్తీకరణ చేస్తామంటూ భారీ ప్రతిపాదనలు పంపారు. అయితే, ఈ పథకం పూర్తిగా డిమాండ్ ఆధారితం అని, రాష్ట్రాలు చూపించే ప్రగతి, సాధించే మైలురాళ్లు ఆధారంగానే నిధులు విడుదలవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీన్నిబట్టి మంజూరైన పనులను కూడా సకాలంలో ప్రారంభించకుండా, నిధులు రాబట్టడంలో రాష్ట్ర పాలకులు పూర్తిగా చేతులెత్తేసినట్టు స్పష్టమవుతోంది.
రైతన్నకు శాపం.. డిస్కంలకు భారం!
సౌర పంప్‌సెట్ల ఏర్పాటు జరిగి ఉంటే రైతులకు పగటిపూటే నాణ్యమైన కరెంట్ అందేది. అలాగే డిస్కంలపై సబ్సిడీ భారం తగ్గి, విద్యుత్ రంగానికి ఊపిరి వచ్చేది. కానీ, పాలకుల పట్టింపులేని తనం, కేంద్రం నిధులు ఇవ్వకుండా చూపిన మొండిచేయి వెరసి.. తెలంగాణ అన్నదాతలకు సౌర భాగ్యం కరవైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఖరిపై రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో సౌర పురోగతి లేకున్నా స్పందించకుండా ఉన్న కేంద్రం, పథకాలను సక్రమంగా అమలు చేయడంలో వైఫల్యం చెందిన రాష్ట్రం రెండూ కలిసి అన్నదాతలను నిలువునా ముంచేశాయని కేంద్రం నివేదిక వెల్లడిస్తోంది. కాగితాల మీద లేఖలు, డిమాండ్లు కోట్లలో కనిపిస్తున్నా.. ఆచరణలో మాత్రం ఒక్క పంప్‌సెట్ కూడా సౌరశక్తీకరణకు నోచుకోకపోవడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
అత్యధిక నిధులు పొందిన టాప్ 5 రాష్ట్రాలు..
ర్యాంక్ రాష్ట్రం విడుదలైన నిధులు (కోట్లలో)
1. మహారాష్ట్ర రూ. 4,515.89
2. హర్యానా రూ. 1,307.48
3. రాజస్థాన్ రూ. 991.30
4. ఉత్తర ప్రదేశ్ రూ. 419.88
5. గుజరాత్ రూ. 365.10






