వైఎస్సార్ పెట్టిన పథకాలను కేసీఆర్ భ్రష్టు పట్టించాడు

by Disha Web Desk 20 |
వైఎస్సార్ పెట్టిన పథకాలను కేసీఆర్ భ్రష్టు పట్టించాడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేశారని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను భ్రష్టు పట్టించాడని వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. వైఎస్.షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం 184వ రోజుకు చేరుకుంది. మోపాల్ మండలం ముల్లంగి క్యాంప్ నుంచి ఘన్ పూర్ మీదుగా డిచ్ పల్లికి చేరుకుంది.

డిచ్ పల్లి రైల్వేస్టేషన్ వద్ద వైఎస్సాఆర్ టీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్.షర్మిల మాట్లాడుతూ నిజాంసాగర్ ఆదునీకరణ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారని, ప్రాణాహిత చేవెళ్ళ ద్వారా రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వైఎస్ అనుకుని మంచిప్ప రిజర్వాయర్ కు రూ.350 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రాణాహిత చేవెళ్ళ పథకాన్ని రూ.350 కోట్ల నుంచి రూ.3500 కోట్లకు పెంచారని అన్నారు. విద్యుత్ కోతలు లేని ప్రాంతం కోసం సుద్దపల్లి వద్ద 400 కే.వీ.సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు.

జక్రాన్ పల్లి వద్ద వైఎస్ హయంలోనే ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు జరిగాయని, ఆయన బ్రతికుంటే రూరల్ లో విమానాలు తిరిగేవన్నారు. ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గాలి మోటారు చూయిస్తానని హామీ ఇచ్చినా అది ఎగురలేదని ఆయన మాత్రం గాలి మోటారు కొనుక్కున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ తన ఫాంహౌజ్ కు నీళ్ళు వచ్చినప్పుడే డిచ్ పల్లికి నీళ్లు ఇస్తానని నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారన్నారు. నియోజకవర్గంలో గల్ప్ బాధితులు ఎక్కువ అని, తెలంగాణ ఏర్పడగానే రూ.500 కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తానని గ్రామీణ గల్ప్ బాధితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. వైఎస్ హయంలో డిచ్ పల్లిలో 550 ఎకరాల్లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దానిని కేసీఆర్ భ్రష్టు పట్టించారన్నారు.

వీసీ బహిరంగంగా మూడు కోట్లకు పదవి కొనుక్కున్నానని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ హయంలో తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి దిగజారిందని అన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లకు అప్పుల కుప్ప చేశారన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులు మొత్తం ఆయన ఇంటికి కమిషనర్ల రూపంలో వెళ్లాయని ఆరోపించారు. కేసీఆర్ కేవలం ఎన్నికల కోసం బయటకు వస్తాడని, ఓట్లు వేయించుకుని ఫాం హౌజ్ వెళ్లిపోతాడన్నారు.

ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ వస్తాడు బాగా డబ్బులు ఇస్తాడని కానీ ప్రజలు కర్రుకాల్చి వాత పట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో స్వార్థ పరిపాలన సాగుతుందని, తెరాసతో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. వైఎస్సాఆర్ బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పరితపించాడని, ఆయన ఏ పథకం పెట్టినా ప్రజల కోసమేనన్నారు. వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీతోనే సంక్షేమ, సుపరిపాలన సాధ్యమని వైఎస్సాఆర్ పెట్టిన ప్రతి పథకాన్ని అద్బుతంగా అమలు చేసి చూపిస్తానని వైఎస్ షర్మిల అన్నారు.


Next Story