- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి వేళ ఆపన్న హస్తం.. 'ఆపరేషన్ కవాచ్' తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు..!
తల్లి మందలించిందని మనస్తాపం.. పంతంతో ఇల్లు వదిలి అర్థరాత్రి ఒంటరి ప్రయాణం.. కానీ ఆ బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చింది కామారెడ్డి పోలీసుల నిశిత దృష్టి.

దిశ, కామారెడ్డి : తల్లి మందలించిందని మనస్తాపం.. పంతంతో ఇల్లు వదిలి అర్థరాత్రి ఒంటరి ప్రయాణం.. కానీ ఆ బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చింది కామారెడ్డి పోలీసుల నిశిత దృష్టి.. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కవాచ్ కేవలం నేరస్తుల వేటకే కాదు.. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అని మరోసారి నిరూపించారు. నిజామాబాద్ నగరం వినాయక నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తన తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరికీ చెప్పకుండా మంగళవారం మధ్యాహ్నం తన సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి.. అర్ధరాత్రి 11:00 గంటల సమయంలో టేక్రియాల్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ 'ఆపరేషన్ కవాచ్' తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు.. చీకట్లో ఒంటరిగా సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి, బాలుడిని ప్రేమతో పలకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కుమారుడి ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున 3:00 గంటలకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను కాపాడిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కవాచ్’ ముఖ్య ఉద్దేశ్యం నేరాల నియంత్రణతో పాటు, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమేనని పునరుద్ఘాటించారు. జిల్లాలో ప్రజల భద్రత కోసం మేము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఆపరేషన్ కవాచ్' నేడు ఆపదలో ఉన్న ఒక బాలుడిని సురక్షితంగా రక్షించడం ఎంతో సంతోషకరమన్నారు. అర్ధరాత్రి వేళ ఆ బాలుడు ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు, మా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, మానవీయ కోణంలో స్పందించి ఆ బాలుడి భవిష్యత్తును కాపాడటం అభినందనీయమన్నారు.






