ఇందూరుకు గంజాయి ముప్పు వీడేనా..?

by Ratna Kumari |

కొన్నేళ్ల క్రితం పట్టణాలు, నగరాల్లోనే గంజాయి గుప్పు మనేది. దీంతో పాటు కొన్‌ని మారూమూల గిరిజన తండాల్లో గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా సాగవుతున్న గిరిజన ప్రాంతాల్లో కనిపించేది.

ఇందూరుకు గంజాయి ముప్పు వీడేనా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కొన్నేళ్ల క్రితం పట్టణాలు, నగరాల్లోనే గంజాయి గుప్పు మనేది. దీంతో పాటు కొన్‌ని మారూమూల గిరిజన తండాల్లో గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా సాగవుతున్న గిరిజన ప్రాంతాల్లో కనిపించేది. మనిషిని నిర్వీర్యం చేసే ఈ మహమ్మారి గంజాయి ప్రస్తుతం పాన్ షాపుల్లో పాన్, సిగరెట్లు లభ్యమవుతున్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు గుట్టుగా విక్రయిస్తున్న అడ్డాల్లో గంజాయి అందుబాటులోకి వచ్చేసింది. పట్టణాలు, నగరాలతోపాటు అన్ని గ్రామాల్లో గంజాయి అవసరమైనంత మేరకు లభ్యమవుతున్న పరిస్థితి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గంజాయి మహమ్మారిని జిల్లా నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమో, వైఫల్యమో తెలియదు కానీ, గంజాయి మాత్రం కాలేజీ విద్యార్థుల నుండి, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం అనేక మంది తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది కానీ, జిల్లా పోలీసు శాఖను, ఎక్సైజ్ శాఖను మాత్రం ఆందోళనకు గురిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డాలు జనాలకు తెలుసు.. అధికారులకు తెలుసు..

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అడ్డాలు ఎక్కడెక్కడున్నాయో, ఎవరెవరకు గంజాయికి అలవాటు పడ్డారో చాలా మందికి తెలుసు. గంజాయి బ్యాచ్ చేసే పనులేంటో, వారు వారి వ్యసనాన్ని ఎవరెవరకి అంటగడుతున్నారో కూడా తెలిసినా మనకెందుకులే అని ఊరుకుంటున్నారు తప్ప గంజాయి బ్యాచ్ పై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. గ్రామాల్లో ఒకరిపై నిందవేసినా, ఈ విషయంలో నిలదీసినా మనుషుల మధ్య కక్షలు పెరుగుతాయనే భయంతో పాటు గంజాయి బ్యాచ్ ఏ రకంగా స్పందించి ప్రతీకారం తీర్చుకుంటారోననే భయంతో ఎవరూ ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలను అడ్డుకోవడానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు, పోలీసు అధికారులకు గంజాయి వాడకం దారుల వివరాలు, విక్రేతల వివరాలు తెలిసినా ఎందుకనో వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భీమ్ గల్ కేసీఆర్ కాలనీలో గంజాయి బ్యాచ్

బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‍ గల్ మున్పిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో గంజాయి సేవించే అలవాటున్న యువకులు చాలా మంది ఉన్నారని, ఇదే కాలనీలో గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న బ్యాచ్ కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ఈ కాలనీకి చెందిన కొందరు యువకులు, మైనర్ బాలలతో పాటు మరో ప్రాంతానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఇప్పటికీ ఇంకా ఈ కాలనీలో గంజాయి బ్యాచ్ కార్యకలాపాలు యధేచ్‌ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

బడాభీమ్‍గల్ లోనూ గంజాయి కలకలం..

బడాభీమ్‍గల్ లోనూ గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతి మించాయని, హైస్కూల్ విద్యా ర్థులతో పాటు, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కూడా ఈ గంజాయి మహమ్మారికి అలవాటు చేస్తున్నారని గ్రామంలో చర్చించుకుంటున్నారు. హైస్కూల్ విద్యార్థుల్లోని కొందరి ప్రవర్తనలో మార్పు రావడం, మాట తీరులో, నడకలో మార్పులను గమనించిన కొందరు టీచర్లు విచారణ చేపట్టగా తమ స్కూల్ విద్యార్థుల్లో.. కొందరు గంజాయికి అలవాటయ్యారనే విషయాన్ని గుర్తించినట్లు పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత విద్యార్థులతో కూడా మాట్లాడి, గంజాయితో ఎలాంటి నష్టాలుంటాయనే విషయంపై కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు.

వాట్సప్ లో చర్చలు..

గంజాయి బ్యాచ్ పై గ్రామంలోని యువకులు, పెద్ద మనుషులు, నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయిని గ్రామం నుండి తరిమేసేందుకు ఏం చేద్దామనే విషయమై గ్రామ ప్రజలు వాట్సప్ గ్రూపులో సీరియస్ గా చర్చించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా గంజాయిని అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అనేక అనుమానాలతో పాటు విమర్శలకు తావిస్తోంది. గంజాయి మహమ్మారికి బలవుతున్న యువకులు, పిల్లల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఎక్‌సైజ్ శాఖపై ఉంది.

Next Story