భార్య మోసం చేస్తోంది.. న్యాయం కావాలంటూ ఓ భర్త నిరసన

by Ratna Kumari |   (  Updated:2025-12-25 16:32:28  IST  )

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లంటే నూరేళ్ల పంట.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఒకటిగా ముడిపడే ఇద్దరి వివాహ బంధం.. ఆ బంధం నిండు

భార్య మోసం చేస్తోంది.. న్యాయం కావాలంటూ ఓ భర్త నిరసన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెళ్లంటే నూరేళ్ల పంట.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఒకటిగా ముడిపడే ఇద్దరి వివాహ బంధం.. ఆ బంధం నిండు నూరేళ్లు సంతోషంగా కలిసుండాలంటే ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. నమ్మకంగా జీవించాలి. ఇద్దరిలో ఎవరికి నమ్మకం కోల్పోయినా, అనుమానపు ఛాయలు వారిద్దరి జీవితాల్లోకి తొంగిచూసినా ఆ దాంపత్యం నరకంగా మారుతుంది. మాంగళ్య బంధాన్ని మోసం చేస్తున్నట్లు తెలిస్తే ఆ జీవితం భార్యకైనా, భర్తకైనా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తాళి ఎగతాళి అవుతుంది. నిజామాబాద్ నగరంలో నాలుగు నెల‌ల‌ క్రితం పెళ్లయిన ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తన భార్య తన సమీప బంధువు (బావ) తో ఇల్లీగల్ ఎఫైర్ కొనసాగిస్తోందని, వాట్సప్ లో తరచూ అసభ్యపదజాలంతో చాటింగ్ చేస్తోందని, ఉచ్ఛరించలేని భాషలో ఇద్దరూ వాట్సప్ చాటింగ్ లు చేస్తున్నారంటూ ప్రశాంత్ అనే ఓ భర్త న్యాయ పోరాటానికి దిగాడు. తనకు న్యాయం కావాలంటూ నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో తన భార్య ప్రియుడి ఇంటి ముందు ఫ్లెక్సీ పట్టుకుని నిరసనకు దిగాడు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ప్రశాంత్ కు సంయుక్త అనే యువతితో ఆగస్టు 13 న పెళ్లైంది. భార్యతో తన బంధం నాలుగునెలల్లోనే ఇలా బీటలు వారుతుందని అనుకోలేదని ప్రశాంత్ అవేధన వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే తన భార్యకు బావ వరసయ్యే వ్యక్తితో శారీరక సంబంధం ఉందని, ఆ సంబంధం పెళ్లాయ్యాక కూడా కొనసాగుతోందని తెలిసి కుమిలిపోతున్నట్టు ప్రశాంత్ వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించినా స్పందించడం లేదని, దీంతో న్యాయ పోరాటానికి దిగానన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫ్లెక్సీ వేయించి మరీ తన భార్య ప్రియుడు ముత్తకుంట లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు తెలిపాడు.

వాట్సప్ చాటింగ్ ద్వారా గుర్తించాను..

తన భార్యకు బావ వరసైన లింబాద్రి తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వాట్సప్ చాటింగులు చూసి గుర్తించినట్లు ప్రశాంత్ తెలిపారు. తన భార్య ఆమె ప్రియుడి మధ్య జరిగిన వాట్సప్ చాటింగులను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయలేదని ఆరోపించారు. భార్య ప్రియుడు ముత్తకుంట లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగిన ప్రశాంత్ తన భార్య వాట్సప్ చాటింగ్ ప్రింట్ లను కూడా ప్రదర్శించారు. తన భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందంటూ కొంతకాలంగా వాట్సప్ లో స్టేటస్ లు కూడా పెడుతున్నాడు. న్యాయం కోసం ధర్నాకు దిగిన ప్రశాంత్ తో లింబాద్రి బంధువులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

తాను భారతదేశ చట్టాలను నమ్ముతానని, తనకు న్యాయం కావాలని ప్రశాంత్ కోరుతున్నారు. ఒక విశ్వకర్మగా, హిందువుగా సనాతన ధర్మాలను, విలువలను నేను పాటిస్తానన్నారు. అక్రమ సంబంధం నడుపుతూ, నన్ను అబద్ధాలతో మోసం చేసి పెళ్లి చేసుకొని తన భార్య నా జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. మగవాడి కారణంగా ఆడదానికి అన్యాయం జరిగితే మహిళ తరఫున న్యాయం కోసం ఆందోళన చేసే మహిళా సంఘాలు ఇప్పుడు నాకు న్యాయం చేసేందుకు రావాలని కోరారు. తమకు పెళ్లి చేసిన పెద్దలే తనకు న్యాయం చేయాలన్నారు. మీడియా మిత్రులు సహకరించాలని కూడా కోరారు. ఈ విషయంలో తన తప్పు ఏదైనా ఉంటే నన్ను శిక్షించాలని కూడా ప్రశాంత్ కోరుతున్నారు. ఇదే విషయాలను ఆయన తన ఫ్లెక్సీలో పొందుపరిచి నిరసనకు దిగారు. గత కొంతకాలంగా వాట్సాప్ స్టేటస్ లలోనే నడిచిన ఈ విషయం గురువారం రోడ్డుపైకెక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Next Story