పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారెవరు..?

by Ratna Kumari |

దిశ, మాచారెడ్డి : పల్లె ప్రజలకు ప్రకృతి ఆహ్లాదాన్ని అందించడానికి ఉద్దేశించిన పల్లె ప్రకృతి వనాలు నేడు మోడు వారి పోయాయి. బీఆర్ఎస్

పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారెవరు..?
X

దిశ, మాచారెడ్డి : పల్లె ప్రజలకు ప్రకృతి ఆహ్లాదాన్ని అందించడానికి ఉద్దేశించిన పల్లె ప్రకృతి వనాలు నేడు మోడు వారి పోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు స్పెషలాఫీసర్ల పాలనలో నిర్వీర్యమైపోయాయి. ఉపాధి హామీ పథకంలో ప్రతి పల్లెలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాలను సంరక్షించడంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయితీకి వాటర్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పల్లె ప్రకృతి వనాలు, హరితహారం మొక్కలు సంరక్షించబడ్డాయి. సర్పంచుల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ పల్లె ప్రకృతి వనాలను, హరితహారం పథకాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది రాజకీయ వివక్షకు నిదర్శనంగా మిగిలిపోతుందనే భావన వ్యక్తంమవుతోంది. పథకం ఉద్దేశం మంచిదైతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పథకాన్ని కొనసాగించే సాంప్రదాయాన్ని ఇనుమడింపజేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఆ పథకం ఫలాలు ప్రజలకందే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రెండేళ్లుగా పట్టించుకోని వైనం..

పల్లె ప్రకృతి వనాలను స్పెషల్ ఆఫీసర్ల పాలన లో రెండేళ్లుగా టాంకర్ నీళ్లు పోసిన దాఖలాలు లేవు. వర్షాకాలంలో పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు పచ్చదనం సంతరించుకున్నాయి. గడ్డి, ఇతర పిచ్చి మొక్కలు పెరిగి ప్రకృతి వనం రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రకృతి వనం, హరితహారం పథకాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ప్రకృతి వనాలు గ్రామానికి దూరంగా కొన్ని గ్రామాల్లో ఉండడం వల్ల వాటి ఉనికి కూడా గ్రామస్తులకు తెలియకుండా పోయింది.

నిధుల లేమితో కొట్టుమిట్టాడిన స్పెషల్ ఆఫీసర్ల పాలన

స్థానిక సంస్థల పరిపాలన ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఫైనాన్స్ నిధులు గ్రామపంచాయతీలకు నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనం, హరితహారాల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధులు లేక నీరసించి పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా వీటిని పట్టించుకోలేదు. అప్పుల ఊబిలోకి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నెట్టిపోయిందని , బ్యాంకుల వద్దకు వెళితే దొంగల మాదిరిగా చూస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో స్పెషల్ ఆఫీసర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో వాటిని గాలికి వదిలేశారు.

ఇప్పటికైనా పునరుద్ధరిస్తారా..?

ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం కొనసాగించే సంప్రదాయం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేకుండా పోయింది. ప్రజాధనంతో అమలులోకి వచ్చిన పథకాలను రాజకీయ విభేదాలతో పక్కన పడేయడంలో అర్థమేమి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం చేసి ప్రవేశపెట్టిన హరితహారం ప్రకృతి వనాల పథకాలను మూలన పడేయడం సమంజసం కాదంటున్నారు. నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడినందున ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి వాటిని పునరుద్ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story