పీఏసీఎస్ లకు పాలకవర్గాలు ఎప్పుడో..?

by Ratna Kumari |

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి సందిగ్ధంగా మారింది.

పీఏసీఎస్ లకు పాలకవర్గాలు ఎప్పుడో..?
X

దిశ, కామారెడ్డి : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఈ సంఘాలకు గత ఐదు నెలలుగా పూర్తి స్థాయి పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలు ఎన్నుకున్నారు. అయితే ఆ పాలకవర్గాలకు కూడా గడువు తీరిపోవడంతో పలుమార్లు అప్పటి ప్రభుత్వం పొడగిస్తూ వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ నెల నాటికి ఆ గడువు కూడా ముగిసిపోవడంతో పాలకవర్గాలు రద్దు అయ్యాయి. దీంతో పర్సన్ ఇన్చార్జీలుగా సహకార సంఘాల అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్సన్ ఇన్చార్జిలుగా ఐదు నెలలుగా అధికారులే వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం ప్రభుత్వం వీటికి ఎన్నికలు నిర్వహిస్తుందా లేక అధికారులనే పర్సన్ ఇంచార్జి లుగా కొనసాగిస్తుందా అనే సంధిగ్ధం ఇటు రైతులతో పాటు అటు అధికారుల్లోనూ నెలకొంది.

పలుమార్లు పాలకవర్గాల పొడగింపు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. 2025 డిసెంబర్ 19న మొదటిసారి ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ రెండోసారి ఆగస్టు 14 వరకు ఆరు నెలల పాటు పొడిగించింది. ఇక్కడి నుంచి డిసెంబర్ 19 వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా డిసెంబర్ 19 నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో పాలకవర్గాల గడువు రద్దయింది.

ప్రత్యక్ష ఎన్నికలా.. నామినేటెడ్ పదవులా..?

ఈ నేపథ్యంలో పీఏసీఎస్ లకు ఎన్నికలు నిర్వ హిస్తారా లేక నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తారా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఇటు రైతులతో పాటు అటు అధికారుల్లోను సందిగ్ధం నెలకొంది. ఇటీవల సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్షంగా అంటే నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఐదు నెలలుగా సహకార సంఘాలకు కార్యవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ జరుగుతుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 సంఘాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 89 కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాకు కలిపి ఒకటే డిసిసిబి ఉండడంతో దీనికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. కాగా 144 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్చార్జిలుగా సహకార శాఖలోని అధికారులు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు.

రైతులకు ప్రత్యక్ష సేవలు

రైతులకు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రత్యక్ష, విస్తృత సేవలు అందుతున్నాయి. రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువుల విక్రయం, ధాన్యం కొనుగోళ్లలో కీలక పాత్ర పో షిస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్టిగేజ్ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, శుపోషణకు కూడా రుణాలు అంది స్తున్నాయి. రైతులకు సబ్సిడీపై ఎరువులు, వివిధ రకాల విత్తనాలు రైతులకు అందజేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.

పాలకవర్గాలు ఉంటే మరిన్ని సేవలు

అయితే పీఏసీఎస్ కార్యదర్శులకు తోడుగా చైర్మెన్లు, డైరెక్టర్ల సేవలు అందితే మరింత మెరుగైన పాలనతో పాటు నాణ్యమైన సేవలు అందుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో కార్యదర్శిలు, పర్సన్ ఇన్చార్జిల సేవలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలతోనే..

సహకార సంఘాల పాలవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం గత యేడాది డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు ఆయా సంఘాలకు అధికారులను వర్సన్ ఇన్ చార్జీలుగా నియమించడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

Next Story