- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు : కలెక్టర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యం నిల్వలను సైతం సేకరించి రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని క

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యం నిల్వలను సైతం సేకరించి రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. గురువారం ఆయన నవీపేట మండలం అభంగపట్నం, తడ్గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట, ఎడపల్లి మండలం జానకంపేట లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. వర్షంలో తడిచిన ధాన్యం అంతటిని ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. అయితే ఇంకా అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగా ఒకచోటికి చేర్చి రాత్రివేళల్లో తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పాలని కోరారు. ప్రస్తుతం తడిచిన ధాన్యాన్ని కూడా బాగా ఆరబెట్టిన అనంతరం తిరిగి బస్తాల్లో నింపాలని సూచించారు. ఇప్పటికే బస్తాలలో నింపిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైస్ మిల్లర్లు రైతులకు అండగా నిలువాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, ఇప్పటికే 704 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాలలో రూ. 201 కోట్ల బిల్లు మొత్తాలను జమ చేశామని, రూ. 45 లక్షల బోనస్ కూడా చెల్లింపు జరిగిందని తెలిపారు. మిగితా బిల్లులను, బోనస్ డబ్బులను కూడా త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వర్ష సూచనలు ఉన్నందున రైతులు ఆరబెట్టిన ధాన్యం నిల్వలను ఎతైన ప్రదేశాల్లో కుప్పలుగా చేసి, అవి వర్షపు నీటికి తడవకుండా తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని కలెక్టర్ హితవు పలికారు.






