- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్దతు ధర కోసం రోడ్డెక్కిన పసుపు రైతులు
పసుపుకు కనీస మద్ధతు ధర కోసం జిల్లా రైతులు రోడ్డెక్కారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండు ఎదుట రోడ్డుపై పసుపు రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 10: పసుపుకు కనీస మద్ధతు ధర కోసం జిల్లా రైతులు రోడ్డెక్కారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండు ఎదుట రోడ్డుపై పసుపు రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా బయలు దేరి బస్టాండు గేటు ఎదుట బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దాదాపు గంటకు పైగా రోడ్డుపై రైతులు బైఠాయించడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మార్కెట్ యార్డులో వ్యాపారుల సిండికేటుతో దళారులు మోసాలకు పాల్పడుతున్నారని, కష్టించి పండించిన పసుపుకు కనీస మద్ధతు ధర కూడా రాకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, మార్కెట్ యార్డులో దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు.
కలెక్టర్ వచ్చే వరకు కదలం..
పసుపు రైతుల సమస్యపై అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించడం లేదని రైతులు ఆరోపించారు. తమ సమస్య పరిష్కారం విషయంలో కలెక్టర్ వచ్చి సమాధానం చెపితే తప్ప కూర్చున్న చోటి నుండి కదిలేది లేదని రైతులు మొండి పట్టు పట్టారు. పచ్చబంగారానికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, పసుపు బోర్డు ఏర్పాటు పేరుతో రైతులను ఇంకా మోసం చేస్తోందని రైతులన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దళారుల చేతిలో గుప్పిట్లో యార్డు..
తెలంగాణలో పసుపు అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుపై అధికారుల ప్రభావం లేదని, యార్డు పూర్తిగా సిండికేట్ వ్యాపారులు, దళారుల గుప్పిట్లో ఉందని రైతులు ఆరోపించారు. మార్కెట్లో జరుగుతున్న మోసాలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తెచ్చినా, పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా పసుపు రైతుల సమస్యపై స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారని రైతులు విమర్శించారు. రైతులకు న్యాయంగా రావాల్సిన మద్దతు ధరను రాకుండా చేసేందుకు వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి అతి తక్కువ ధరలను ఫిక్స్ చేసి అంతకే కొనుగోలు చేస్తామని నియంతలా వ్యవహరిస్తున్నారని ధర్నాలో రైతులు వ్యాపారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలన్ని పాటిస్తూ మార్కెట్ కు తీసుకొచ్చిన పసుపుకు కూడా వ్యాపారులు వంకలు పెడుతున్నారన్నారు. నాణ్యత విషయంలో వంకలు పెడుతూ తక్కువ ధరకే పసుపును కొంటూ రైతులను నిండా ముంచుతున్నారని వాపోయారు.
రోజుల తరబడి మార్కెట్లోనే..
జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండే కాకుండా జగిత్యాల జిల్లానుండి కూడా పెద్ద సంఖ్యలో రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపును తీసుకొస్తున్నారని, అందరినీ వ్యాపారులు మోసం చేస్తున్నారని ధర్నాలో బైఠాయించిన రైతులు మండిపడ్డారు. పసుపుకు ఆశించిన ధర రావడం లేదని, ధర వచ్చాకే అమ్ముకుందామని ఆగిన రైతులను వారం రోజులకు పైబడి ఆగినా పసుపును కొనడం లేదన్నారు. ఎకరాల కొద్దీ విస్తరించి ఉన్న మార్కెట్లో వందల సంఖ్యలో పసుపు రాశులు పోసి రైతులు అమ్ముకోడానికి సిద్ధంగా ఉంచితే వ్యాపారులు కొన్ని కుప్పలను మాత్రమే పరిశీలించి, పసుపు నాణ్యతగా లేదని సర్టిఫై చేస్తున్నారని ఆవేదన చెందారు. రోజుల తరబడి మార్కెట్లోనే పసుపు కుప్పలకు కాపలా ఉండాల్సిన వస్తోందని రైతులంటున్నారు. చేసేది లేక విసిగిపోయి వ్యాపారులు చెల్లించిన ధరకే పసుపును అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
పసుపు బోర్డు వచ్చింది.. పసుపుకు మంచి ధర మాత్రం రాలే..
నిజామాబాద్ జిల్లా రైతుల దశాబ్దాల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు పసుపు బోర్డు ఇచ్చినా, పసుపుకు మంచి మద్ధతు ధరను మాత్రం ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. తాము పండించిన పసుపునకు కనీస మద్దతు ధర రూ.15 వేలు వస్తేనే పసుపు రైతులకు గిట్టుబాటవుతుందని, లేదంటే చాలా నష్టపోతామని వారన్నారు.
కలెక్టర్ హామీతో ధర్నా విరమణ..
గంటకు పైగా పసుపు రైతులు ధర్నా నిర్వహించడంతో పాటు కలెక్టర్ రావాలని డిమాండ్ చేయడంతో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ ధర్నా స్థలానికి వచ్చారు. రైతులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలను తాను అర్ధం చేసుకోగలనని కిరణ్ కుమార్ అన్నారు. పసుపుకు మద్ధతు ధర లభించే విషయంలో తాను ఉన్నతాధికారులు, మార్కెట్ యార్డు అధికారులతో, వ్యాపారులతో మాట్లాడుతానని ధర్నాను విరమించాలని రైతులను కోరారు. రైతులు ససేమిరా అనడంతో వారిని సముదాయించి, మార్కెట్ యార్డుకు వెళ్లి మాట్లాడుదామని, పసుపును కూడా పరిశీలిద్దామని చెప్పడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు. అనంతరం రైతులతో కలిసి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మార్కెట్ యార్డుకు వెళ్లారు. మార్కెట్ యార్డు అధికారులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. రైతుల సమస్యపై దృష్టి సారించి మద్ధతు ధర విషయంలో సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు.






