- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాపారులను ఆగం చేస్తే ఊరుకునేది లేదు
చిరు వ్యాపారులకు అండగా ఉంటామని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు

X
దిశ, కామారెడ్డి: చిరు వ్యాపారులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారాల దుకాణాలను తొలగించాలని చూస్తే ఊరుకునేదిలేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ గోడకు అనుకొని ఉన్న చిరు వ్యాపార దుకాణాలను తొలగించి వారిని పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతంలో, గంజ్ స్కూల్ ప్రాంతంలో నిర్మించనున్న భవనాల్లోకి మారుస్తామని చెప్పారన్నారు.
అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అలాంటి సందర్భంలో చిరు వ్యాపారులను ఇక్కడ దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించడం సబబు కాదన్నారు. ఇప్పటికే సర్వే నంబర్ 6లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న 12 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే వారి రేకుల షెడ్డులను కూల్చివేయడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. వీరు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని, దానికి ఎప్పుడూ మేము స్వాగతం పలుకుతామన్నారు. కానీ 45 ఏళ్లుగా వీటినే నమ్ముకొని బతుకుతున్న చిరు వ్యాపారులు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రెండు నెలల్లో భవనాలు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంత స్పీడ్‌గా పనులు నిర్వహించినా ఆరు నెలల సమయం పడుతుందన్నారు.
ఎమ్మెల్యే చూపించిన మ్యాప్ అధికారికం కాదు..
ఎమ్మెల్యే రమణారెడ్డి కొత్త భవనాలు నిర్మించనున్నట్లు చూపించిన మ్యాప్ అధికారికం కాదని అది కేవలం తాను వ్యక్తిగతంగా తయారు చేసుకున్నది మాత్రమేనన్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ మ్యాప్‌ను చూపిస్తూ మున్సిపల్ నిధులతో భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపల్‌లో నిధుల కొరత ఉందని, సిబ్బంది వేతనాలు చెల్లించడానికే ఇబ్బందిగా ఉందన్నారు. ఈ నిధులతో నిర్మాణాలు చేపట్టాలంటే మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదంతా ప్రక్రియను పక్కనపెట్టి కేవలం రెండు నెలల్లోనే మున్సిపల్ నిధులతో భవనాలు నిర్మించి అందులోకి చిరు వ్యాపారులను పంపిస్తామని చెప్పడం హాస్వాస్పదంగా ఉందన్నారు. స్టేషన్ రోడ్డులో వర్షాకాలం వస్తే చిన్నపాటి వర్షానికి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుందని, ఈ నీరు పోవడానికి ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి పెద్ద మురికి కాలువ నిర్మిస్తే తాము స్వాగతిస్తామన్నారు.
రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందంజలో ఉందన్నారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలే అభివృద్ధికి నిదర్శనం అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వంలో పని చేసే వారినే ఎన్నుకోవాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఉర్దొండ రవి సంపరి శ్రీనివాస్, మామిండ్ల రమేష్ గడ్డమీది మహేష్ గౌరు నవీన్ నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి చాట్ల వంశీ జూలూరు సుధాకర్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- nizamabad
Next Story






