- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు లేవు : జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు
జిల్లా కాంగ్రెస్ లో గ్రూపులు, తగాదాలు లేవని, సమిష్టి కృషితో రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, స్పష్టం చేశారు.

దిశ, కామారెడ్డి : జిల్లా కాంగ్రెస్ లో గ్రూపులు, తగాదాలు లేవని, సమిష్టి కృషితో రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేల సమక్షంలో డీసీసీ అధ్యక్షునిగా ఏలే మల్లికార్జున్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు నాయకులు నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు.
మల్లికార్జున్ నియామకం చారిత్రాత్మకం : ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు
డీసీసీ అధ్యక్షునిగా ఏలే మల్లికార్జున్ నియామకం చరిత్రాత్మకమని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు అవకాశాలు వస్తాయని మరోసారి రుజువైందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పని చేస్తుందన్నారు. చిన్న వయసులో అవకాశం వస్తే సమర్థవంతమైన నాయకత్వం అలవరుస్తుందన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో డీసీసీ అధ్యక్షుని నియామకం జరిగిందన్నారు. డీసీసీ అధ్యక్షుని బాధ్యత చాలా పెద్దదని, ఓపిక చాలా అవసరమని, సీనియర్ల అనుభవాలను పంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగించి ఆయనను బీజేపీ అవమానించిందన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా యజ్ఞం కొనసాగుతోందన్నారు. సామాన్య ప్రజలను బ్రతకనిస్తారా అని ప్రశ్నించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, దానికోసం పార్టీలోని సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. రాజకీయాల్లో కొందరికి అవకాశాలు వస్తాయి.. మరికొందరికి రావని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని, పార్టీనే తమ జెండా అని, ఇతర ఎజండాలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నామని, రాబోయే అన్ని ఎన్నికల్లో ఇదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. పార్టీ నూతన కార్యాలయం అందరికి సంబంధించినదని, ఏ ఒక్కరికి పరిమితం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా ప్రజలకు క్షేత్రస్థాయిలో చెప్పుకోలేకపోయామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు.
అందరినీ కలుపుకుపోతా : డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్
డీసీసీ అధ్యక్షునిగా అందరితో కలుపుకుని సమిష్టిగా ముందుకు సాగుతానని, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకం కాగానే తమకు పరీక్ష పెట్టినట్టుగా సర్పంచుల ఎన్నికలు వచ్చాయని, జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఎలాంటి గ్రూపులు, తగాదాలు లేవని, నాయకుడిగా కాకుండా సోదరునిగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.






