సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటి పై ట్రాక్టర్ తో దాడి

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ ( ఎల్లారెడ్డి) : సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై రాజకీయ కక్షలతో ట్రాక్టర్ తో దాడి చేయగా

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటి పై ట్రాక్టర్ తో దాడి
X

దిశ, నాగిరెడ్డిపేట్ ( ఎల్లారెడ్డి) : సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై రాజకీయ కక్షలతో ట్రాక్టర్ తో దాడి చేయగా నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్​పేట్​ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతుదారుడు ఓడిపోయాడు. అయితే తాము గెలిచినప్పటికీ గతంలో తమను ఇబ్బందులు పెట్టాడనే కక్షతో ప్రత్యర్థి వర్గం గ్రామంలోని ఓడిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిపై ట్రాక్టర్ తో దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు పేర్కొన్నారు. ట్రాక్టర్​తో ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లగా బాలరాజు తప్పించుకున్నాడని వారు తెలిపారు. ట్రాక్టర్ తో ఢీకొన్న ప్రమాదంలో గంజి భారతి, తోట శారద, బాలమణి, సత్యవ్వ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గంజి భారతి, తోట శారద పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు. బాలమణి, సత్యవ్వలను ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. రాజకీయ కక్షలతోనే ఓడిన అభ్యర్థి ఇంటి పై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత వర్గానికి మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్​ఎస్​ నాయకులు సభ్యులు గ్రామస్తులతో కలిసి ఎల్లారెడ్డి _ నిజాంసాగర్​ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని, ఆయనను ప్రోత్సహించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్​, సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమించేది లేదని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు.

Next Story