Stray Dogs: కుక్కల రాజ్యం గ్రామాల్లో..! నిజామాబాద్‌ జిల్లాలో వీధి కుక్కల దాడులు తీవ్రం

by Ramesh Naini |

గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.

Stray Dogs: కుక్కల రాజ్యం గ్రామాల్లో..! నిజామాబాద్‌ జిల్లాలో వీధి కుక్కల దాడులు తీవ్రం
X

దిశ, నవీపేట్ : గ్రామాల్లో (Stray dogs) వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లను చంపి తింటున్నాయి. అంతేకాకుండా చాలామంది కుక్కకాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో వీధుల్లో తిరుగుతూ అరుస్తుండడంతో నిద్రపట్టని పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. పలు గ్రామాల్లో వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు, గుంపులుగా సేద తీరుతున్నారు. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ పడి వేస్తుండడంతో కుక్కల సంచారం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మాంసానికి అలవాటు పడిన కుక్కలు మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. అలాగే లేగదూడలపై దాడులు చేసి చంపి తింటున్నాయి. కుక్కల నియంత్రణ లేకపోవడంతో గ్రామాల్లో కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సుప్రీంకోర్టు కోర్టు హెచ్చరించినా...

కుక్క కాటు మరణాల పై సుప్రీంకోర్టు హెచ్చరించిన అధికారులతో ఎలాంటి చలనం లేదు. వీధి కుక్కలను జనాలు తిరిగే ప్రాంతాల నుండి తరలించాలని, విద్యా సంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్ లలో రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు జారీచేసిన క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, వీధి కుక్కల కాటుకు జంతువులు, పిల్లలు బలి అవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసిన గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులుగుంపులుగా తిరుగుతూ రోడ్లపై కనబడిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ప్రతి శనివారం నవీపేట్ మండల కేంద్రంలో జరిగే మేకల సంతలో మేకల కాపలా కోసం తీసుకువచ్చే కుక్క లను మేకల విక్రయం అనంతరం ఇక్కడే వదిలేసి వెళ్తుండటంతో వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వీధి కుక్కలు సమూహాలుగా ఏర్పడి ఆయా వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. చివరకు పాఠశాలలకు సైతం వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతుండడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట బెట్టుకుని బడులకు తీసుకెళ్తున్నారు. తరుచూ కుక్కకాటు సంఘటనలు జరుగుతున్నప్పటికీ, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.

మాంసం విక్రయాలు జరిగే ప్రాంతాల్లో..

మాంసం విక్రయాలు జరిగే ప్రాంతాల్లో కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. సంతలలో ఆయా వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి కూడా కుక్కల బెడద ఎదుర్కోక తప్పడం లేదు. సాధారణ సమయాల్లోనూ ఏదో ఒక చోట కుక్కలు దాడి చేసి ప్రజలతో పాటు చిన్నారులను గాయపరు స్తున్నా, నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీధుల్లో, రోడ్లపై పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.

నివాస ప్రాంతాల్లో ప్రజలు కుక్కల బెడదకు జంకాల్సి వస్తోంది. ఈ మధ్యనే బాన్సువాడ లో కుక్కల కాటుకు ప్రజలు గాయపడిన సంగతి విదితమే. నవీపేట్ మండలం రైల్వే స్టేషన్ ఏరియా లో 6 సంవత్సరాల బాలుడికి కుక్క గాయపరిచింది. కుక్కల బెడదలపై స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం పెంపుడు కుక్కను పెంచుకోవాలన్నా స్థానిక గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెంచుకునే కుక్కలకు యజమాని క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. దీంతో అవి అనుకోకుండా ఎవరినైనా కరిచి గాయప ర్చినా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ, అటు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ భయపెట్టిస్తున్నాయి. గ్రామ సింహాలు కరవడంతో పశువులు కూడా మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెంజల్ మండల కేంద్రంలో ఇటీవల రేబిస్ వ్యాధితో లేగదూడ మరణించింది.

అధికారుల చర్యలు..

మండలంలో ఆగస్టు నెలలో 49 సెప్టెంబర్ లో 42, అక్టోబర్ లో 56 కుక్క కాట్లు కేసులు నమోదయ్యాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఎక్కువ డాగ్ బైట్ కేసులు నమోదు అయ్యే గ్రామంలో సెక్రటరీకి సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సిఫార్సు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశానుసారం కుక్కల బెడద నుంచి తమను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story