నందిపేటలో కత్తిపోట్ల కలకలం.. యువకుడికి తీవ్ర గాయాలు

by Kodari Anjali |

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై ఐదుగురు దాడి చేశారు.

నందిపేటలో కత్తిపోట్ల కలకలం.. యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, నందిపేట: మండల కేంద్రంలో వివేకానంద చౌరస్తా సమీపంలోని ఒక ఆర్డర్ మెస్‌కు ఆదివారం కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు కత్తులు, రాడ్లతో ఓ యువకుడు పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేటలోని రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన షేక్ నయీం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి కత్తులు, ఇనుప రాడ్లుతో దాడి చేశారు. దీంతో నయిం తలకు, చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి.

హత్యాయత్నం కేసు నమోదు

షేక్ నయిం, షేక్ ఖయ్యూంలు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరికొంత మంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని ఖయ్యూం భార్య వసీమా బేగం ఫిర్యాదులు పేర్కొన్నారు. వీరికి గతంలో పాత కక్షలు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని తన మరిది షేక్ నయీమ్ ను చంపేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదు చేశారు. దాడి విషయం తన భర్తకు చెప్పడంతో ఆయన 108 కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న తన మరిది షేక్ నయీమ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ వివరించారు.

Next Story