- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి19: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకెపి సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, లక్షా 69 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు.
మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా.. 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇందులో 6.80 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం, దొడ్డు రకం 2.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 472 కేంద్రాలు, దొడ్డు ధాన్యం సేకరణకు 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో అత్యధికంగా 481 కేంద్రాలు, ఐకెపి 107, డీసీఎంఎస్ ద్వారా 68, మెప్మా ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 లు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 లు బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన వెంటనే టాబ్ ఎంట్రీలు జరపాలని, తద్వారా వారికి త్వరితగతిన చెల్లింపులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో అనవసర తప్పిదాలకు పాల్పడుతూ, నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు.
నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమైనందున ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కాగా, రైతులు దళారులకు ధాన్యం కట్టబెట్టి మోసపోకుండా, ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజా గౌడ్, జెడ్పి సిఈఓ సాయాగౌడ్, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, మెప్మా పీ.డీ రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.






